దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. ఏప్రిల్ 1 నుంచి తమ వాహన ధరలను పెంచినట్లు వెల్లడించింది. వాహన ధరలను సగటున 0.8 శాతం పెంచినట్లు (ఎక్స్‌షోరూం, దిల్లీ) శనివారం తెలిపింది. అయితే తయారీ వ్యయాల భారం పెరగడం సహా నూతన ప్రమాణాల మేరకు తయారీలో చేయాల్సిన మార్పుల వల్ల వాహన ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచనున్నట్లు మార్చి 23నే మారుతీ ప్రకటించింది.
అంతకుముందు.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి భారత్‌లో కార్లు, ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్ ధరలు పెంచనున్నట్లు వివిధ వాహనాల తయారీ సంస్థలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల వల్లే భారత్‌లో వాహనాల ధరలు పెంచుతున్నట్లు తయారీ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తమ కంపెనీకి చెందిన వాహన ధరలను పెంచతున్నట్లు మారుతీ సుజుకీ శనివారం ప్రకటించింది.
టాటా కార్ల ధరలు పెరిగే అవకాశం..
భారత కార్ల తయారీ సంస్థ.. టాటా మోటార్స్ కూడా ఏప్రిల్ 1 నుంచి వాహనాల ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. వాణిజ్య కార్ల ధరలు 5 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త బీఎస్-6 స్టేజ్ 2లోని నిబంధనల కారణంగానే ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ కార్ల ధరలు వాటి మోడళ్ల ఆధారంగా పెరుగుతాయని తెలిపింది.
భారత్‌లో పెరగనున్న బైక్‌ల ధరలు..
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ధరల పెంపు నిర్ణయం తీసుకునే ముందు.. పరిస్థితులను అంచనా వేస్తామని ఆ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యోగేశ్ మాథుర్ తెలిపారు. కానీ వెంటనే ధరల పెంపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇది ముడి పదార్థాలు, ఉద్గార నిబంధనలతో సహా.. పలు ఫ్యాక్టర్లపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే.. ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని యోగేశ్ మాథుర్ అన్నారు.
మెర్సిడెస్- బెంజ్ కారు ధరల కూడా..
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన మెర్సిడెస్-బెంజ్ కూడా భారత్‌లో వాహనాల ధరలు పెంచనున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ 1 నుంచి 5 శాతం వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. యూరోతో పోలిస్తే రూపాయి విలువలో తగ్గుదల.. పెరిగిన ఇన్‌పుట్, లాజిస్టిక్స్ ఖర్చులు కంపెనీకి భారంగా మారినట్లు పేర్కొంది.