జూన్ ఒకటో తేదీ నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. ఆదాయంపై ప్రభావం చూపే కొన్ని కీలక మార్పుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎస్బీఐ గృహరుణ గ్రహీతలు, యాక్సిస్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వినియోగదారులు, వాహనాల యజమానులను ప్రభావితం చేసే మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఆ మార్పులేమిటో తెలుసుకుందాం.
ఎస్బీఐ గృహ రుణాల వడ్డీ రేట్ల పెంపు
భారతీయ స్టేట్ బ్యాంక్ తమ వినియోగదారులపై వడ్డీ భారం మోపనుంది. హోమ్‌లోన్ ఎక్టెర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్(ఈబీఎల్ఆర్)ను 40 బేసిస్ పాయింట్లు పెంచి.. 7.05శాతంగా చేయనుంది. అంతకుముందు ఈబీఎల్ఆర్ 6.65 శాతంగా ఉండేది. మరోవైపు.. రెపో లింక్డ్ లెండింగ్ రేట్(ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.25 శాతం నుంచి 6.65 శాతానికి పెంచింది. అలాగే ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది.
థర్డ్‌పార్టీ మోటార్ బీమా ప్రీమియం
వాహనాలకు థర్డ్ పార్టీ బీమా ప్రీమియం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1న మారిన ప్రీమియంలు అమలులోకి రానున్నాయి. 1000 సీసీ వరకు ఉన్న వాహనాలకు థర్డ్‌పార్టీ ఇన్స్యూరెన్స్ రూ.2094, వెయ్యి నుంచి 1500 సీసీ వరకు రూ.3,416, ఆపైన రూ.7,897 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు.. ఒకే విడతలో చెల్లించే ప్రీమియంను 1000 సీసీ వరకు రూ.6,521, 1000-1500సీసీ రూ.10,540, ఆపైన రూ.24,596గా నిర్ణయించింది. ద్విచక్రవాహనాల విషయంలో 75సీసీ ఇంజిన్ వరకు రూ.538, 75-155సీసీ వరకు రూ.714, 150సీసీ నుంచి 350సీసీ వరకు 1,366, ఆపైన సీసీ వాహనాలకు రూ.2,804 చెల్లించాలి.
గోల్డ్ హాల్‌మార్కింగ్
రెండో దశ బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి నిబంధనలు 2022, జూన్ 1న అమలులోకి రానున్నాయి. ఇప్పటికే ఉన్న 256 జిల్లాలతో పాటు 32 కొత్త జిల్లాలు అసెంబ్లింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్(ఏహెచ్‌సీ) పరిధిలోకి రానున్నాయి. ఆయా జిల్లాల్లో 14,18,20,22, 23,24 క్యారెట్ల బంగారు ఆభరణాలును హాల్మార్కింగ్తోనే విక్రయించాలి.