తెలంగాణ

telangana

ETV Bharat / business

విమానంలో మహిళపై మూత్రం కేసులో ఎయిర్ ​ఇండియాకు చిక్కులు - ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసులు

ఎయిర్​ ఇండియా విమానం బిజినెస్‌ క్లాసులో ఓ ప్రయాణికుడు తప్పతాగి అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారంపై ఆ సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీచేసింది. అంతకుముందు ఈ ఘటనలో నిందితుడు, వృద్ధురాలు రాజీ కుదుర్చుకున్నారని ఎయిర్​ఇండియా.. డీజీసీఏకు తెలిపింది. మరోవైపు, డిసెంబరు 6న మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్రం పోసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పారిస్ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది.

Air India
ఎయిర్ ఇండియా

By

Published : Jan 5, 2023, 6:07 PM IST

Updated : Jan 5, 2023, 6:58 PM IST

న్యూయార్క్-దిల్లీ మధ్య ప్రయాణిస్తున్న ఎయిర్​ ఇండియా విమానంలో వృద్ధురాలిపై ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ఇండియా అధికారులు, సిబ్బందికి డీజీసీఏ గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

"విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? రెండు వారాల్లోగా మా నోటీసుకు ఎయిర్ ​ఇండియా సమాధానం చెప్పాలి. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. ఎయిర్‌ ఇండియా వ్యవహారశైలి బాధ్యతాయుతంగా లేదు."

--డీజీసీఏ

అంతకుముందు ఈ ఘటనపై ఎయిర్​ ఇండియా.. డీజీసీఏకు నివేదిక అందించింది. వృద్ధురాలు, ఆమెపై మూత్రం పోసిన వ్యాపారవేత్త పరస్పర అంగీకారంతో ఈ సమస్యను పరిష్కరించుకున్నారని తెలిపింది. అందుకే ఎయిర్​ ఇండియా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. మహిళపై మూత్రం పోసిన వ్యాపారవేత్తపై 30 రోజులపాటు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించకుండా ఇప్పటికే నిషేధం విధించామని ఆ సంస్థ అధికారులు తెలిపారు. అలాగే ఈ ఘటనపై అంతర్గత కమిటీ రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు.

అసలేం జరిగిందంటే..
గత ఏడాది నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో 70 ఏళ్ల వృద్ధురాలు బిజినెస్‌ క్లాసులో ఉండగా.. మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఆమె సీటు దగ్గరకు వచ్చి ఆమెపై మూత్రం పోశాడు. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి కదలకపోవడం వల్ల మరో ప్రయాణికుడు వచ్చి బలవంతంగా పంపించారు. భోజనం తర్వాత విమానంలో లైట్లు ఆర్పేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ప్రయాణికుడి చర్య కారణంగా తన దుస్తులు, బ్యాగు తడిచిపోయాయని తెలిపారు. దీంతో సిబ్బంది ఆమెకు మరో జత దుస్తులు, స్లిప్పర్స్‌ ఇచ్చారు.

అలాంటిదే మరో ఘటన..
పారిస్- దిల్లీ మధ్య ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తప్పతాగిన ఓ ప్రయాణికుడు.. మహిళ దుప్పటిపై మూత్రం పోశాడు. ఈ ఘటన డిసెంబరు 6న జరిగింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు మహిళకు రాతపూర్వకంగా క్షమాపణ చెప్పడం వల్ల అతనిపై చర్యలు తీసుకోలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

"ఎయిర్​ ఇండియా విమానం డిసెంబరు 6న దిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్​పోర్ట్​కు చేరుకుంది. ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో సిబ్బంది సూచనలను పాటించడం లేదని.. మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్రం పోశాడు. విమానాశ్రయంలో దిగగానే ప్రయాణికుడిని సీఐఎస్​ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు మహిళా ప్రయాణికురాలితో అతడు రాజీ కుదుర్చుకున్నాడు. అనంతరం నిందితుడు.. మహిళా ప్రయాణికురాలికి రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాడు. అప్పుడు అతడిని విడిచిపెట్టాం. "

-- దిల్లీ విమానాశ్రయ అధికారులు

Last Updated : Jan 5, 2023, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details