M&M Q1 results:జూన్ త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) రూ.2360.70 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.331.74 కోట్లతో పోలిస్తే, ఇది 7 రెట్లు అధికం. వాహన, సాగు పరికరాల విభాగాలు గణనీయంగా రాణంచడం ఇందుకు కారణం. ఇదే సమయంలో ఆదాయం రూ.19171.91 కోట్ల నుంచి రూ.28412.38 కోట్లకు చేరింది. ఖర్చులు కూడా రూ.20286.24 కోట్ల నుంచి రూ.26195.01 కోట్లకు పెరిగాయి. సెమీకండక్టర్ చిప్ కొరత చాలావరకు తగ్గిందని, చైనా-తైవాన్ ఉద్రిక్తతల వల్ల ఎలాంటి ప్రభావం పడుతుందో అప్పుడే ఏమీ చెప్పలేమని ఎం అండ్ ఎం ఎండీ అనిశ్ షా పేర్కొన్నారు.
- వాహన విభాగ ఆదాయాలు రూ.6316.79 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.12740.94 కోట్లకు చేరాయి. విక్రయించిన వాహనాల సంఖ్య 85,858 నుంచి 74 శాతం అధికమై 1,49,803కు చేరాయి.
- వ్యవసాయ పరికరాల విభాగ ఆదాయం రూ.7188.74 కోట్ల నుంచి రూ.8427.66 కోట్లకు పెరిగింది. ట్రాక్టర్ల విక్రయాలు 99127 నుంచి 18 శాతం పెరిగి 117413కు చేరాయి.
- ఆర్థిక సేవల విభాగాదాయం రూ.2530.15 కోట్ల నుంచి రూ.2876.61 కోట్లకు, ఆతిథ్య విభాగాదాయం రూ.393.76 కోట్ల నుంచి రూ.613.19 కోట్లకు చేరాయి. స్థిరాస్తి విభాగాదాయం రూ.149.51 కోట్ల నుంచి 94.82 కోట్లకు తగ్గింది.