Loan With Credit Card : క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు చేయొచ్చు. కొన్నిసార్లు పరిమితి మేరకు ఏటీఎం నుంచి నగదునూ తీసుకోవచ్చు. ఈ రెండింటికీ మించి కార్డుపై వ్యక్తిగత రుణాన్ని అందుకునే వీలూ ఉంటుంది. మీ క్రెడిట్ స్కోరు, కార్డును వాడుతున్న తీరును బట్టి, కార్డు సంస్థలు ఈ రుణాన్ని ముందుగానే మంజూరు చేస్తుంటాయి. అవసరం ఉన్నప్పుడు ఒక్క క్లిక్‌తో మీకు రుణం లభిస్తుంది. దీనికి ఎలాంటి హామీ అవసరం లేదు. నిర్ణీత వ్యవధి, స్థిరమైన వడ్డీతో దీనిని తీసుకోవచ్చు. సాధారణ వ్యక్తిగత రుణాలతో పోలిస్తే కార్డులు అందించే రుణానికి వడ్డీ కాస్త అధికంగానే ఉంటుంది.
క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకోవడం, రుణం తీసుకోవడం రెండూ వేర్వేరు అన్న సంగతి ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కార్డును ఉపయోగించి నగదు తీసుకున్నప్పుడు మీ కార్డు పరిమితి ఆ మేరకు తగ్గుతుంది. పైగా దీనికి 36-48 శాతం వరకూ వడ్డీ విధిస్తారు. బిల్లింగ్ తేదీ నాడు మొత్తం బాకీని చెల్లించాలి. దీనికి భిన్నంగా కార్డుపై రుణం తీసుకుంటే.. 36 నెలల వరకూ వ్యవధి ఉంటుంది. వడ్డీ రేటు 16-18 శాతం వరకూ ఉండే అవకాశం ఉంటుంది. పైగా కార్డు పరిమితితో దీనికి సంబంధం ఉండదు.
క్రెడిట్ కార్డును తీసుకునేప్పుడు మీరు సమర్పించిన పత్రాలు, ఇతర ఆధారాల ఆధారంగానే కార్డుపై వ్యక్తిగత రుణం ఇస్తారు. కాబట్టి, ప్రత్యేకంగా అదనపు పత్రాలను అందించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి, సులభంగా రుణం పొందే మార్గాల్లో ఇదొకటిగా చెప్పొచ్చు.
ముందే చెప్పినట్లు క్రెడిట్ కార్డు వాడకం, బిల్లు చెల్లించిన తీరును బట్టి, ముంద0స్తుగా రుణం మంజూరై ఉంటుంది. ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డు ఖాతాలో వివరాలను గమనిస్తే మీకు ఈ సంగతి తెలుస్తుంది. అవసరమైనప్పుడు క్షణాల్లో ఆ రుణాన్ని పొందవచ్చు. వడ్డీ వివరాలు, ఈఎంఐ ఎంత అనేది చూసుకోవాలి. మీ క్రెడిట్ కార్డు బిల్లుతో కలిసి ఈ వాయిదాలూ చెల్లించాల్సి ఉంటుంది.
వ్యవధిని కార్డు వినియోగదారుడు నిర్ణయించుకునే వీలుంటుంది. 6 నెలల నుంచి 36 నెలల వరకూ రుణ వ్యవధి ఉంటుంది. కొన్ని కార్డు సంస్థలు అయిదేళ్ల వ్యవధి వరకూ అనుమతిస్తున్నాయి.
మంచిదేనా?
తప్పనిసరిగా డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వెసులుబాటు ఉంటే ఇతర మార్గాలను అన్వేషించాలి. క్రెడిట్ కార్డుపై రుణాలకు అధిక వడ్డీ రేటు ఉంటుంది. మీ మొత్తం ఈఎంఐలు ఆదాయంలో 40 శాతం మించకుండా చూసుకోండి. కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోతే అప్పుల ఊబిలో చిక్కుకుపోతాం. రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరూ దెబ్బతింటుంది.