తెలంగాణ

telangana

ETV Bharat / business

లోన్​ రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా?.. అయితే ఇలా చేయండి.. మీ జోలికి అస్సలు రారు!

Loan Recovery Harassment : బ్యాంక్​లు, ఇతర సంస్థల్లో రుణాలు తీసుకున్న రుణగ్రహీతలపై ఆయా సంస్థలు వేధింపులకు గురిచేస్తుంటాయి. రికవరీ ఏజెంట్లతో ఇబ్బందులు సైతం కలిగిస్తుంటాయి. అటువంటి సమయంలో ఏం చేయాలో.. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం.

loan-recovery-harassment-what-to-do-when-harassed-by-loan-agents
లోన్ రికవరీ ఏజెంట్ వేధింపులు చేస్తే ఏం చేయాలి

By

Published : Apr 30, 2023, 6:19 PM IST

Loan Recovery Harassment : బ్యాంకులు, రుణ సంస్థలు అవసరమైన వారికి రుణాలను విపరీతంగా ఇస్తున్నాయి. వినియోగదారులకు రుణ మంజూరు ఎంత వేగంగా జరుగుతుందో.. అంతే వేగంగా డిఫాల్ట్‌లు కూడా పెరుగుతున్నాయి. ఈ డిఫాల్ట్‌ల విషయంలో చాలా రుణ సంస్థలు వినియోగదారులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఏజెంట్లను పంపి లోన్ చెల్లించాలని వినియోగదారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దృష్టికి సైతం వచ్చింది.

కొవిడ్‌ అనంతరం చాలా బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థలు రుణాలు సరిగ్గా వసూలు కాక చాలా ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ఆ సంస్థలన్ని రికవరీ ఏజెంట్లపై ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా, రుణాలు వసూలు చేసేందుకు ఈ ఏజెంట్లలో చాలా మంది ఆమోదయోగ్యం కాని పద్ధతులను ఆశ్రయించారు.

ఆర్‌బీఐ ఏం చెబుతోంది?
రికవరీ ఏజెంట్ల చేతిలో వినియోగదారులు వేధింపులకు గురికాకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గతంలోనే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం.. రికవరీ ఏజెంట్ల చర్యల బాధ్యత.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్‌లపై ఉంటుంది. లోన్​ రికవరీ సమయంలో ఏజెంట్లు మాటలతో గానీ శారీరకంగానూ రుణగ్రహీతలను భయపెట్టడం, వేధించడం లాంటివి చేయడం లేదని రుణ సంస్థలు నిర్ధారించుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. రుణ గ్రహీతలను బహిరంగంగా అవమానపరచడం, గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం వంటి చర్యలకూ పాల్పడరాదని తెలిపింది. రికవరీ ఏజెంట్లు ఫోన్‌ కాల్స్‌ ద్వారా, సామాజిక మాధ్యమాల గుండా ఎలాంటి అనుచితమైన సందేశాలను పంపడానికి, బెదిరించడానికి అనుమతి లేదని ఆర్​బీఐ వెల్లడించింది. రికవరీ ఫోన్​ కాల్స్​ ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే చేయాలని సూచించింది. ఈ మార్గదర్శకాలు అమల్లో ఉన్నప్పటికీ.. ప్రజలు తమ హక్కులపై అవగాహన లేని కారణంగా ఏజెంట్ల వేధింపులకు గురవుతూనే ఉన్నారు.

రికవరీ ఏజెంట్లు చేసేవి..
బకాయిల రికవరీ కోసం రుణగ్రహీతల స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదించడం వంటివి చేస్తుంటారు. వారి పని ప్రదేశంలో, ఇరుగుపొరుగు వారి ఎదుట గొడవలు సృష్టించడం ద్వారా రుణదాతల పరువు తీసేందుకు రికవరీ ఏజెంట్లు ప్రయత్నిస్తుంటారు. అలాంటప్పుడు బ్యాంకుపై, ఏజెంట్‌పై పరువు నష్టం దావా వేసే హక్కు రుణగ్రహీతకు ఉంటుంది. దాంతో పాటు మీ అనుమతి లేకుండా.. రికవరీ ఏజెంట్‌ మీ ఆస్తిని అతిక్రమించి ఉన్నట్లయితే వారికి వ్యతిరేకంగా కోర్టులో అతిక్రమణ దావా కూడా మీరు వేయొచ్చు.

వేధింపులను ట్రాక్‌ చేయండి..
చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయినప్పుడు రికవరీ ఏజెంట్లు మిమ్మిల్ని కనెక్ట్‌ అయ్యే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో రుణగ్రహీతలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏజెంట్‌ మిమ్మల్ని వేధింపులకు గురిచేస్తే.. రికవరీ ఏజెంట్‌ నుంచి వచ్చిన అన్ని కాల్స్‌, ఇ-మెయిల్స్‌, మెస్సేజ్​లు ట్రాక్‌ చేయండి. మీరు వేధింపులకు గురి అవుతున్నట్లు నిరూపించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

లోన్‌ రికవరీ ఏజెంట్ల వేధింపుల ఫిర్యాదును ఎక్కడ చేయాలో.. ఎలా చేయాలో చూద్దాం.

రుణగ్రహీత చేయాల్సినవి..
రికవరీ ఎజెంట్ల నుంచి ఉపశమనం పొందేందుకు.. వేధింపులకు గురవుతున్న వ్యక్తి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. పోలీసులు ఎలాంటి సాయం అందించకపోయినా, ఫిర్యాదును స్వీకరించకపోయినా.. రుణగ్రహీత బ్యాంకుకు వ్యతిరేకంగా మధ్యంతర ఉపశమనం కోసం కోర్డులో సివిల్‌ ఇంజంక్షన్‌ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. వేధింపులకు వ్యతిరేకంగా పరిహారం సైతం కోరవచ్చు. ఈ వేధింపుల ఆధారాలు తీసుకుని రుణ సంస్థను, రుణానికి సంబంధించిన అధికారిని కూడా సంప్రదించవచ్చు.

రుణగ్రహీత థర్డ్‌-పార్టీ రికవరీ ఏజెంట్‌ నుంచి ఏ రకంగాను వేధింపులకు గురైన.. ఆ చర్యను ఫిర్యాదు రూపంలో నేరుగా బ్యాంకు అంబుడ్స్‌మన్‌ దృష్టికి తీసుకువెళ్లాలి. మీ ఫిర్యాదులను బ్యాంకు అంబుడ్స్‌మన్‌ పరిష్కరించకపోయినా, వేధింపులు ఇంకా అలాగే కొనసాగినా.. రుణగ్రహీత తప్పనిసరిగా ఆర్‌బీఐకు ఫిర్యాదు చేయాలి. మీ ఫిర్యాదును లేఖ రూపంలోనూ లేందటే ఇ-మెయిల్‌ చేసి పూర్తి పరిస్థితిని ఆర్​బీఐకి వివరించాలి. బ్యాంకు, దాని ఏజెంట్లు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పాటించకపోయినట్లయితే అది వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది.

లోన్ చెల్లింపుల్లో మార్గదర్శకాలను ఉల్లంఘించడం, రికవరీ ఏజెంట్లు అనుసరించే చట్టవిరుద్ధ పద్ధతులను రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా తీవ్రంగా పరిగణిస్తుంది. రుణాలు, అడ్వాన్సుల విషయంలో తన సర్క్యులర్‌ ఆర్‌బీఐ చాలా కచ్చింతంగా పేర్కొంది. అవసరమైతే రుణగ్రహీతకు సంబంధించిన నిర్దిష్ట ఏరియాలో రికవరీ ఏజెంట్లను నిషేదించే అవకాశం ఉంది. మార్గదర్శకాలను నిరంతరం ఉల్లంఘిస్తే.. ఆయా రుణ సంస్థలపై కఠిన చర్యలు సైతం ఆర్​బీఐ తీసుకుంటుంది. నిజమైన ఫిర్యాధులపైన మాత్రమే రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటుంది.

ABOUT THE AUTHOR

...view details