Loan Default : బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి చాలా మంది తమ అవసరాల కోసం రుణాలు తీసుకుంటూ ఉంటారు. కానీ, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల సకాలంలో బ్యాంకు రుణాలు తీర్చలేకపోవచ్చు. లేదా పూర్తిగా రుణాన్ని చెల్లించలేక ఇబ్బంది పడవచ్చు. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు.. భవిష్యత్‌లో మళ్లీ రుణాలు మంజూరు కావడం కష్టం అవుతుంది.
ఒక్కసారికి ఏమీ కాదు!
ఒక్కోసారి రుణ వాయిదాలు సకాలంలో చెల్లించడం కుదరకపోవచ్చు. ఇలా ఒక సారి ఈఎంఐ చెల్లించకపోయినంత మాత్రాన డిఫాల్ట్ చేసినట్లు కాదు. ఈఎంఐ ఆలస్యానికి కేవలం జరిమానా మాత్రమే వేస్తారు. కానీ వరుసగా 3 నెలలపాటు ఈఎంఐ చెల్లించకపోతే.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దానిని డిఫాల్ట్‌గా పరిగణిస్తాయి.
లోన్ డిఫాల్ట్ అయితే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి?
Loan Default Consequences : బ్యాంకు రుణాలు తీసుకుని.. ఎగవేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుణ సంస్థలు డిఫాల్టర్ విషయాలను క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తాయి. వెంటనే అవి మీ క్రెడిట్ స్కోర్‌ను బాగా తగ్గిస్తాయి. ఒకసారి మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటే.. మళ్లీ మీకు బ్యాంకు రుణాలు మంజూరు కావడం చాలా కష్టమవుతుంది.
సురక్షిత, అసురక్షిత రుణాలు అంటే ఏమిటి?
What Are Secured And Unsecured Loans?
- మీరు ఏదైనా ప్రోపర్టీని తనఖా పెట్టి రుణం తీసుకుంటే.. దానిని సురక్షితమైన రుణంగా పరిగణిస్తారు. మీరు ఎలాంటి హామీ చూపించకుండా తీసుకునే రుణాన్ని.. అసురక్షితమైన రుణంగా భావిస్తారు.
- సురక్షితమైన రుణంపై డిఫాల్ట్ అయినట్లయితే, బ్యాంకులు తమ బకాయిలను తిరిగి పొందేందుకు.. చట్టపరంగా మీరు తాకట్టు పెట్టిన వస్తువులను లేదా ఆస్తులను వేలం వేసి, వచ్చిన డబ్బును తమ రుణం కింద జమ చేసుకుంటాయి. కనుక మీ క్రెడిట్ స్కోర్‌పై పెద్దగా ప్రభావం పడదు.
- అదే మీరు పర్సనల్ లోన్ లాంటి అసురక్షిత రుణాలను డిఫాల్ట్ చేస్తే, మీ క్రెడిట్ స్కోర్ తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా బ్యాంకు లోన్లే కాదు.. క్రెడిట్ కార్డులు పొందడం కూడా కష్టమవుతుంది.
- వాస్తవానికి లోన్ డిఫాల్ట్.. నిర్దిష్ట కాలం వరకు రికార్డుల్లో ఉంటుంది. మీరు కనుక ఈ సమయంలోపు ఎలాగోలా రుణాన్ని తిరిగి తీర్చివేస్తే, మళ్లీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది.