Life Insurance Tax Benefits vs Life Insurance coverage : కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక రక్షణ (ఇన్సూరెన్స్ కవరేజ్) కల్పించడం కోసం జీవిత బీమా తీసుకుంటూ ఉంటాం. అయితే చాలా మంది పన్ను ఆదా (టాక్స్ సేవింగ్) అవుతుందనే ఉద్దేశంతో తక్కువ ప్రీమియం, తక్కువ బీమా కవరేజ్ ఉంటే పాలసీలను ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఇది ఏ మాత్రం సరికాదు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక రక్షణ కావాలి!
ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చాలా మంది పన్ను ఆదా గురించి ఆలోచనలు మొదలుపెడతారు. ముఖ్యంగా పన్ను మినహాయింపు కోసం జీవిత బీమా పాలసీలను ఎంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బీమా పాలసీలను కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడం కోసం ఎంచుకోవాలి. అంతేకాని కేవలం పన్ను ఆదా కోసమే వాటిని ఎంచుకోకూడదు.
పాత పన్ను చట్టాలు ఏం చెబుతున్నాయి?
పాత ఆదాయపు పన్ను విధానం ఎంచుకున్న వారు సెక్షన్ 80సీ ప్రకారం, రూ.1,50,000 పరిమితి వరకూ వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేసుకోవచ్చు. ఇందులో జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంలూ ఉంటాయి.
ఆర్థిక రక్షణకే ప్రాధాన్యం!
జీవిత బీమా ప్రధాన లక్ష్యం.. అనుకోని కష్టం వచ్చినప్పుడు కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించడం. వాస్తవానికి చాలా మంది పన్ను ప్రయోజనాల కోసం.. తక్కువ ప్రీమియం ఉన్న పాలసీలను ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తూ ఉంటారు. దీనివల్ల వారి పన్ను ఆదా లక్ష్యం నెరవేరుతుంది. కానీ, కుటుంబానికి అవసరమైన రక్షణ మాత్రం లభించకపోవచ్చు.
అవసరాలకు అనుగుణంగా!
ముందుగా మీకు ఎంత బీమా కవరేజ్ అవసరమో చూసుకోండి. మీ ఆదాయం, జీవన శైలి, బాధ్యతలు, అప్పులు అన్నీ లెక్కించుకొని ఎంత విలువైన పాలసీని తీసుకోవాలో నిర్ణయించుకోండి. వాస్తవానికి ప్రతి వ్యక్తి తన వార్షికాదాయానికి కనీసం 10 నుంచి 12 రెట్లు కవరేజ్ ఉండేలా జీవిత బీమా పాలసీ తీసుకోవడం మంచిది. అంతేకానీ, కేవలం పన్ను ఆదా కోసం.. తక్కువ మొత్తం కవరేజ్ ఉండే పాలసీని తీసుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
పన్ను మినహాంపు- అదనపు ప్రయోజనం మాత్రమే!
మీ కుటుంబానికి పూర్తి ఆర్థిక రక్షణ కల్పించే విధంగా పాలసీని తీసుకోవాలి. పన్ను ఆదా కావడం అనేది కేవలం ఆ పాలసీ కల్పించే అదనపు ప్రయోజనంగానే చూడాలి.