*నాకు వయసు పెరిగిపోయింది. కొన్ని వ్యాధులూ ఉన్నాయి. బీమా పాలసీ తీసుకునేందుకు అర్హత ఉంటుందా?
ఎలాంటి పాలసీలను కోరుకుంటున్నారు అనేదాన్ని బట్టి, పాలసీ వచ్చేదీ లేనిదీ ఆధారపడి ఉంటుంది. ముందుగా పాలసీ తీసుకోవాలనుకునే వ్యక్తి అవసరాలు ఇక్కడ పరిశీలించాలి. అధిక వయసు ఉన్న వారికి యాన్యుటీ పాలసీలు సరిపోవచ్చు. పూర్తి రక్షణకే పరిమితమయ్యే (టర్మ్) పాలసీలను ఇచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేకపోతే పాలసీ కాస్త అధిక ప్రీమియంతో తీసుకోవచ్చు. ముందస్తు వ్యాధులు ఉన్నప్పటికీ.. కొన్ని పరిమితులకు లోబడి ఉంటే.. ఆ మేరకు ప్రీమియంలో లోడింగ్ ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బీమా సంస్థ పాలసీ ఇవ్వడానికి తిరస్కరించే ఆస్కారం ఉంది. కాబట్టి, వయసు పెరిగినా.. బాధ్యతలు ఉన్నప్పుడు బీమా తప్పనిసరిగా ఉండాలి.
* జీవిత బీమా అంటే పెట్టుబడే. దీనికన్నా ఇతర పథకాల్లో అధిక రాబడి వస్తుంది కదా?
పెట్టుబడులను పోల్చేటప్పుడు ఎప్పుడూ ఒకే తరహా పనితీరు ఉన్న వాటిని చూడాలి. జీవిత బీమా పాలసీల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని రక్షణకే పరిమితం అవుతాయి. మరికొన్ని దీర్ఘకాలిక పెట్టుబడులకు తోడ్పడతాయి. మరికొన్ని పదవీ విరమణ తర్వాత పింఛను ఇస్తుంటాయి. స్టాక్ మార్కెట్ ఆధారిత పాలసీలు కొన్ని. జీవితాంతం వరకూ రక్షణ ఇచ్చే పాలసీలూ ఉన్నాయి. కాబట్టి, ఏదో ఒక పెట్టుబడి పథకంతో.. బీమా పాలసీలను పోల్చలేం. అదే సమయంలో ఒక పాలసీని మరో విభాగంలోని పాలసీతోనూ కలిపి చూడకూడదు. జీవిత బీమా పాలసీలు సాధారణంగా దీర్ఘకాలిక పథకాలు. చెల్లించిన ప్రీమియానికి పన్ను మినహాయింపునూ ఇస్తాయి. పాలసీదారుడికి అనుకోనిదేమైనా జరిగితే పరిహారం ఇస్తాయి. పెట్టుబడి పథకాల్లో ఇలాంటి ప్రయోజనాలు ఉండవు అనేది గుర్తుంచుకోవాలి.
* యూనిట్ ఆధారిత పాలసీల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇవి మంచి పథకాలు కావు..
యూనిట్ ఆధారిత పథకాలు (యులిప్) రెండు విధాలుగా పనికొస్తాయి. జీవిత బీమా రక్షణ. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధి. ఇప్పుడు వస్తున్న కొత్తతరం యులిప్‌లలో రుసుములు తక్కువగానే ఉంటున్నాయి. కొన్ని పాలసీలు వ్యవధి తీరిన తర్వాత మోర్టాలిటీ/ ఇతర రుసుములను వెనక్కి ఇస్తున్నాయి. మారుతున్న అవసరాలకు అనుగుణంగా పాలసీని ఎంచుకునేందుకు ఇవి తోడ్పడతాయి. అవసరానికి పాక్షికంగా పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది.
* క్లెయిం చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి? బీమా సంస్థ పరిహారం మొత్తం ఇచ్చేందుకు ఇష్టపడదు..
బీమా తీసుకున్న పాలసీదారుడికి అనుకోనిది ఏమైనా జరిగినప్పుడు నిర్ణయించిన మేరకు పరిహారం అందించాలి. బీమా సంస్థ ప్రాథమిక వ్యాపార సూత్రం ఇది. బీమా సంస్థ, పాలసీదారుడికి మధ్య కుదిరే ఒక నమ్మకమైన ఒప్పందమే బీమా పాలసీ. పాలసీ తీసుకునే వ్యక్తి తన గురించి ఎలాంటి దాపరికం లేకుండా అవసరమైన వివరాలన్నీ అందించాలి. ఆరోగ్య, ఆర్థిక, అలవాట్ల వివరాలను స్పష్టంగా తెలియజేయాలి. పాలసీకి క్రమం తప్పకుండా ప్రీమియాన్ని చెల్లించాలి. అన్నీ సరిగ్గా ఉంటే.. పాలసీదారుడికి అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు పరిహారం ఇవ్వడంలో ఎలాంటి ఆలస్యం ఉండదు. ఇప్పుడంతా డిజిటల్ కాబట్టి, క్లెయిం చెల్లింపులు మరింత సులభం అయ్యాయనే చెప్పొచ్చు.
ఒక వ్యక్తి లేదా కుటుంబానికి భిన్నమైన ఆర్థిక అవసరాలుంటాయి. ఒక వ్యక్తికి అనుకూలమైన పథకం.. మరో వ్యక్తికి ఎందుకూ పనికిరాకపోవచ్చు. కాబట్టి, మీ ఆర్థిక అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పాలసీలను ఎంచుకోవడం ఎప్పుడూ మంచిది. అనుమానాలుంటే నిపుణుల సలహాలు పాటించాలి. సరైన పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్ట సమయంలో అండగా ఉంటుంది.
- ఆర్‌ఎం విశాఖ, ఎండీ-సీఈఓ, ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ