LIC Dhan Vriddhi Endowment Policy : దేశంలోనే ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీలో కోట్లాది మంది ప్రజలు పాలసీలు తీసుకున్నారు. నెలవారీ లేదా వార్షిక ప్రీమియం చెల్లించేవారు ఎంతో మంది ఖాతాదారులు ఉన్నారు. అయితే పాలసీదారులను పెంచుకునేందుకు ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన పాలసీలను రూపొందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఎల్‌ఐసీ మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది.
ధన్ వృద్ధి పాలసీ
LIC Dhan Vriddhi Plan 869 : ధన్‌వృద్ది పేరుతో ఎల్‌ఐసీ కొత్త ఎండోమెంట్ పాలసీ (ప్లాన్ నంబర్ 869)ని తీసుకొచ్చింది. ఈ పాలసీలో ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కచ్చితమైన రాబడితో పాటు డెత్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. ఈ ఏడాది జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ పాలసీ అందుబాటులో ఉంటుందని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. ఈ పాలసీలో కనీస జీవిత బీమా రూ.1,25,000 వరకు ఉండాలి.
పాలసీదారులకు రెండు ఆప్షన్లు
ఈ పాలసీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. వాటిల్లో ఒక ఆప్షన్‌ను పాలసీదారులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చెల్లించిన ప్రీమియానికి 1.25 రెట్లు రాబడి వచ్చే ఒక ఆప్షన్; 10 రెట్లు కవరేజీ వచ్చే రెండో ఆప్షన్ ఉంటుంది. ఈ పాలసీకి కనీస ప్రవేశ వయస్సును 90 రోజుల నుంచి 8 సంవత్సరాల మధ్య నిర్ణయించారు. ఇక గరిష్ఠ వయస్సు 32 నుంచి 60 సంవత్సరాలుగా ఉంది. ఇక పాలసీ కాల వ్యవధి విషయానికొస్తే.. 10, 15 లేదా 18 సంవత్సరాలలో దేనినైనా మీరు ఎంచుకోవచ్చు.