LIC Jeevan Kiran Plan : ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మరో సరికొత్త టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని లాంఛ్ చేసింది. 'జీవన్ కిరణ్' (ప్లాన్ 870) పేరుతో తీసుకొచ్చిన ఈ ఎల్ఐసీ పాలసీ.. నాన్ లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ సేవింగ్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ పాలసీలోని ప్రత్యేకత ఏమిటంటే.. మెచ్యూరిటీ పూర్తి అయ్యాక అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి పాలసీదారునికి చెల్లిస్తారు.
ప్రీమియం వెనక్కి ఇచ్చేస్తారు!
Premium return LIC Policy : సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రీమియం మొత్తాన్ని వెన్కక్కు ఇవ్వరు. కానీ ఈ జీవన్ కిరణ్ పాలసీలో బీమా హామీ ఇవ్వడం సహా.. మెచ్యూరిటీ సమయంలో ప్రీమియం మొత్తాన్ని వాపసు ఇస్తారు. వాస్తవానికి జీవన్ కిరణ్ పాలసీ తీసుకున్న వ్యక్తి టర్మ్ పూర్తి అయ్యాక కూడా జీవించి ఉన్నట్లయితే.. అప్పటి వరకు అతను కట్టిన ప్రీమియం మొత్తాన్ని, తిరిగి అతనికే ఇచ్చేస్తారు. కానీ అతను చెల్లించిన ఎక్స్ట్రా ప్రీమియంగానీ, రైడర్ ప్రీమియంగానీ లేదా అప్పటి వరకు కట్టిన పన్నులు గానీ వెనక్కు ఇవ్వడం జరగదు. రెగ్యులర్ ప్రీమియంతో పాటు, సింగిల్ ప్రీమియంకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది.
పాలసీ టెన్యూర్ మధ్యలోనే మరణిస్తే!
LIC Jeevan Kiran Maturity : జీవన్ కిరణ్ పాలసీ తీసుకున్న వ్యక్తి ఒక వేళ టెన్యూర్ మధ్యలోనే దురదృష్టవశాత్తు మరణిస్తే.. అతని కుటుంబానికి (నామినీకి) బేసిక్ సమ్ అస్యూర్డ్ మొత్తాన్ని ఇచ్చేస్తారు. అలాగే వార్షిక ప్రీమియంనకు 7 రెట్లు లేదా అప్పటి వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105 శాతం వెనక్కు ఇస్తారు. వాస్తవానికి ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే, దానిని పాలసీదారుని కుటుంబానికి లేదా నామినీకి అందిస్తారు. ఒక వేళ సింగిల్ ప్రీమియం ప్లాన్ తీసుకొని ఉంటే.. నామినీకి బేసిక్ సమ్ అస్యూర్డ్ (ప్రాథమిక మొత్తం) లేదా సింగిల్ ప్రీమియంలో 125 శాతం, ఏది ఎక్కువైతే అది అందిస్తారు.
ఎల్ఐసీ జీవన్ కిరణ్ పాలసీదారుడు.. తన మరణానంతరం నామినీకి ఏక మొత్తంగా బీమా సొమ్ము అందేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు. లేదా ఐదేళ్ల పాటు విడతల వారీగా బీమా సొమ్ము అందేలా కూడా ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
జీవన్ కిరణ్ పాలసీ అర్హతలు
LIC Jeevan Kiran Plan Eligibility : ఎల్ఐసీ జీవన్ కిరణ్ పాలసీ కొనుగోలు చేయాలంటే కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు 65 ఏళ్లు ఉండొచ్చు. పాలసీ మెచ్యూరిటీకి కనీస వయస్సు 28 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయస్సు 80 సంవత్సరాలు.