LIC Jeevan Azad Policy : లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యం. ఇందుకోసం మార్కెట్లో అనేక బీమా కంపెనీలు వివిధ రకాల ఇన్సూరెన్స్ పాలసీలను తమ కస్టమర్లకు అందిస్తుంటాయి. అయితే ప్రముఖ బీమా కంపెనీ ఎల్ఐసీ ప్రవేశపెట్టిన ఓ ప్రత్యేకమైన బీమా పాలసీ గురించి తెలుసుకుంటే మాత్రం కచ్చితంగా దాన్ని తీసుకోక మానరు. అదే 'ఎల్ఐసీ జీవన్ ఆజాద్ పాలసీ'. ఈ డిఫరెంట్ పాలసీని తమ వినియోగదారుల కోసం ఈ ఏడాది జనవరిలో అందుబాటులోకి తెచ్చింది. పాలసీ లాంఛ్ చేసిన 10-15 రోజుల్లోనే 50 వేలకు పైగా ఎల్ఐసీ జీవన్ ఆజాద్ పాలసీలు అమ్ముడుపోయాయంటే దీనికున్న బెనిఫిట్స్‌ను అర్థం చేసుకోవచ్చు. పాలసీ స్పెషాలిటీ ఏంటంటే.. మనం ఏ ప్లాన్‌ను తీసుకున్నా 8 సంవత్సరాలు ప్రీమియం మొత్తాన్ని మనం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు మీరు ఒక 20 సంవత్సరాలు పాలసీ ప్లాన్‌ను ఎంచుకుంటే దానికి కేవలం 12 ఏళ్ల ప్రీమియం అమౌంట్ కడితే చాలు. అలాగే ఈ పథకం కింద పాలసీ వ్యవధి(మెచ్యురిటీ) ముగిసే సమయానికి నిబంధనల ప్రకారం కచ్చితమైన హామీతో కూడిన పెద్దమొత్తాన్ని పాలసీదారు చేతికి అందజేస్తుంది ఎల్ఐసీ.
ఎల్ఐసీ జీవన్ ఆజాద్ పాలసీ అంటే ఏమిటి..?
LIC Jeevan Azad Policy Details : ఎల్ఐసీ అందిస్తున్న అనేక ఇన్సూరెన్స్ ప్లాన్లలో జీవన్ ఆజాద్ పాలసీ మంచి జనాదరణను సంపాదించుకుంది. ఇది వ్యక్తిగత, నాన్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే ఈ రకమైన పాలసీలను లో-రిస్క్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు. వీటిద్వారా వినియోగదారులు కచ్చితమైన హామీతో కూడిన రిటర్న్‌లను పొందుతారు. ముఖ్యంగా ఇవి మార్కెట్ ఒడుదొడుకుల ప్రభావం వీటిపై పడవు. కాబట్టి ఈ పాలసీ ద్వారా వచ్చే రాబడులకు మార్కెట్ పనితీరుతో ఏ మాత్రం సంబంధం ఉండదు. దీనిని ఓ లిమిటెడ్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్‌గా చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం ప్రీమియం పేయింగ్ టర్మ్-పీపీటీ (20 సంవత్సరాల ప్లాన్ అనుకుందాం) నుంచి 8 సంవత్సరాలను తీసేసి మిగతా కాలానికి మాత్రమే ప్రీమియం చెల్లించాలనే నిబంధన ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక 20 సంవత్సరాల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారనుకోండి.. దానికి మీరు కేవలం 12 ఏళ్ల ప్రీమియం అమౌంట్ చెల్లిస్తే చాలు. మీ ప్లాన్ మెచ్యురిటీ తీరే సరికి మొత్తం పాలసీ ప్లాన్ అమౌంట్ మీకు తిరిగి చెల్లిస్తారు. అదేవిధంగా 18 సంవత్సరాల పాలసీ ప్లాన్‌కు 10 సంవత్సరాల పాటు ప్రీమియంలు చెల్లిస్తే సరి.
పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే..
LIC Jeevan Azad Policy Rules : ఈ ప్రత్యేక ప్లాన్‌కు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే అర్హులు. అంటే ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా ఈ పాలసీ తీసుకోవడం కుదరదు. ప్రస్తుతానికి ఈ ప్లాన్ కింద ఒక్కో వ్యక్తికి కనిష్ఠంగా రూ.2 లక్షలు, గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అది కూడా పాలసీ తీసుకోవాలని అనుకునే వ్యక్తి సమర్పించే ఫిజికల్ ఫిట్నెస్ రిపోర్ట్(మెడికల్ సర్టిఫికేట్)పై ఆధారపడి ఉంటుంది. కాగా, ఎల్ఐసీ జీవన్ ఆజాద్ పాలసీ ప్లాన్ గడువు 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది.