మహమ్మారి నేపథ్యంలో నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పెరిగింది. పెట్టుబడుల గురించి, భద్రత గురించి ఆలోచిస్తున్నారని ఇటీవల కాలంలో పలు నివేదికలు తెలియజేశాయి. దురదృష్టకర సంఘటనల వల్ల కుటుంబం ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టర్మ్ పాలసీలు వారికి మొదటి ప్రాధాన్యంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ పాలసీలు కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి. కాబట్టి, పాలసీని తీసుకునేటప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీకు ఏది సరిపోతుందో చూసుకోవాలి. చెల్లించిన ప్రీమియానికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కాబట్టి, ఇది పన్ను ప్రణాళికలోనూ ముఖ్యమే.
కొన్నాళ్లు ప్రీమియం చెల్లించకున్నా...
సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ కొనసాగుతూ ఉండాలంటే.. క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. కొన్నిసార్లు వ్యవధి తీరిన తర్వాత కొన్ని రోజుల పాటు అదనపు గడువు లభిస్తుంది. అప్పటికీ ప్రీమియం చెల్లించకపోతే.. నిబంధనల మేరకు బీమా రక్షణ దూరమవుతుంది. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది చిక్కు సమస్యే. కొత్తతరం పాలసీలు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాయి. వైద్యపరమైన కారణాల వల్ల ఊహించని ఖర్చుల వల్ల ప్రీమియం చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రీమియం చెల్లింపును తాత్కాలికంగా నిలిపి వేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీనివల్ల దీర్ఘకాలం పాటు ఆర్థిక రక్షణ పొందాలనుకునే వారికి పాలసీదారులు.. కొంతకాలం ప్రీమియం చెల్లించకున్నా రక్షణ కొనసాగుతుంది. దీనివల్ల ప్రీమియం చెల్లించే వీలు కుదిరినప్పుడు మళ్లీ కొత్త పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత పాలసీకి ప్రీమియం చెల్లించి, దానిని తిరిగి వెలుగులోకి తీసుకురావచ్చు.
చెల్లింపు ఎలా...
పాత కాలపు టర్మ్ పాలసీల్లో.. పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడు నామినీకి వెంటనే పాలసీ విలువ మేరకు పరిహారం చెల్లించేవారు. ఇప్పుడు కొత్త పాలసీలు పరిహారం చెల్లింపు విధానాన్ని అందించడంలో వినూత్న మార్పులు చేస్తున్నాయి. బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు.. క్లెయిందారుకు 100 శాతం హామీ మొత్తాన్ని చెల్లించే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా కొన్నేళ్లపాటు నెలనెలా ఆదాయంగా చెల్లించే ఏర్పాటూ చేయొచ్చు. కొన్ని పాలసీలు.. పరిహారాన్ని కొంత ఏక మొత్తంగా చెల్లించి, మిగతాది కొన్ని నెలలపాటు క్రమం తప్పకుండా నామినీకి అందిస్తాయి. ఏక మొత్తంలో చెల్లింపుతోపాటు, ఏటా పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా నెలనెలా చెల్లింపులను అధికం చేసేవీ అందుబాటులో ఉన్నాయి. పాలసీదారుడు ఏ తరహా చెల్లింపు ఉండాలనేది పాలసీతీసుకునేటప్పుడే నిర్ణయించుకోవాలి.