Gold ETF fund of fund : ఇటీవలి కాలంలో బంగారం, వెండిపై ఎలక్ట్రానిక్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టే అలవాటు మదుపరుల్లో పెరుగుతోంది. కేవలం ఈక్విటీలకే పరిమితం కాకుండా.. పెట్టుబడుల్లో కొంత వైవిధ్యం ఉండాలని, అందులో భాగంగా పసిడి, వెండికి కొంత మొత్తం కేటాయించాలని భావిస్తున్నారు. అటువంటి వారికి అనువైన రీతిలో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మోతీలాల్ ఓస్వాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌ను తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ అక్టోబర్ 7న ముగియనుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.500. దీనికి అభిరూప్ ముఖర్జీ ఫండ్ మేనేజర్. ఈ పథకం కింద ఇతర మ్యూచువల్ ఫండ్లకు చెందిన గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ పథకాలను కొనుగోలు చేస్తారు.
బంగారంపై పెట్టుబడికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్, ఎస్‌బీఐ- ఈటీఎఫ్ గోల్డ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్‌లను పరిశీలించే అవకాశం ఉంది. వెండి పథకాల కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్, నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్, ఆదిత్య బిర్లా సిల్వర్ ఈటీఎఫ్‌లను పరిగణనలోకి తీసుకోవచ్చు. ప్రధానంగా బంగారం ఈటీఎఫ్‌లకు 70 శాతం నిధులు, మిగిలిన సొమ్ము వెండి ఈటీఎఫ్ యూనిట్లకు కేటాయించే అవకాశం ఉంది. మదుపరులు తమ పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.