కుమార్‌కు రూ.15లక్షల ఆరోగ్య బీమా పాలసీ ఉంది. పాలసీ తీసుకునేటప్పుడు ప్రీమియం తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా 20 శాతం వరకు సహ చెల్లింపు ఉన్నా ఇబ్బంది లేదు అనుకున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన కుమార్‌కు రూ.8 లక్షల వరకు ఖర్చయ్యింది. సహ చెల్లింపు నిబంధన వల్ల ఇందులో రూ.1.60 లక్షల వరకు చేతి నుంచి పెట్టుకోవాల్సి వచ్చింది. ఆరోగ్య బీమా ప్రీమియం పెరిగిందనే కారణంతో ఇటీవల కాలంలో చాలామంది సహ చెల్లింపుతో పాలసీని తీసుకుంటున్నారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు ప్రయోజనం లభించినా.. మున్ముందు ఇబ్బందులు తప్పవు. కాస్త ప్రీమియం అధికంగా ఉన్నా.. మొత్తం క్లెయిం వచ్చే పాలసీలే ఎప్పుడూ ఉత్తమం.
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూర్తి స్థాయి బీమా పాలసీ ఉన్నా.. సహ చెల్లింపు నిబంధన వర్తిస్తుందని బీమా సంస్థలు చెబుతాయి. వీటిలో ముఖ్యమైన వాటిని గమనిస్తే..
*కొన్ని బీమా సంస్థలు.. నెట్‌వర్క్ ఆసుపత్రిలో కాకుండా.. ఇతర చోట చికిత్స చేయించుకున్నప్పుడు ఈ సహ చెల్లింపు నిబంధనను పాటిస్తాయి. మీ సమీపంలో బీమా సంస్థ నెట్‌వర్క్ ఆసుపత్రి ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ లేకపోతే ముందుగా ఈ విషయాన్ని బీమా సంస్థతో చర్చించండి. అత్యవసర పరిస్థితుల్లో బీమా సంస్థ సహ చెల్లింపు నిబంధన నుంచి వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది.