ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో క్రమానుగత పెట్టుబడులు ఎంతో కీలకం. భవిష్యత్తు అవసరాలను తీర్చుకునేందుకూ పొదుపు, మదుపులను ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉండాలి. దీనికోసం ఎన్నో పెట్టుబడి మార్గాలున్నాయి. ఇందులో కొన్ని సురక్షితమైనవి, మరికొన్ని కాస్త నష్టభయంతో ఉంటాయి. పొదుపు కోసం రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండగా, పెట్టుబడి కోసం మ్యూచువల్ ఫండ్లలో సిప్‌లాంటి మార్గాలున్నాయి. ఇప్పుడు ఈ పథకాల జాబితాలోకి క్రమానుగత పొదుపు విధానం( సిస్టమేటిక్ డిపాజిట్ ప్లాన్- ఎస్‌డీపీ) అందుబాటులోకి వచ్చింది.
ఏమిటిది?
Systematic deposit plan : ఎస్‌డీపీ పనితీరు ఆర్‌డీ, ఎఫ్‌డీల తరహాలోనే ఉంటుంది. చిన్న మొత్తాల్లో క్రమానుగతంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఎస్‌డీపీని పరిశీలించవచ్చు. చాలామంది మదుపరులు ఒకేసారి పెద్ద మొత్తంలో మదుపు చేయలేరు. ఇలాంటి వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. వ్యవధి తీరిన తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో వెనక్కి తీసుకోవచ్చు.