తెలంగాణ

telangana

ETV Bharat / business

మూడేళ్లకు ఒకసారే ప్రీమియం! లాంగ్​టెర్మ్​ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ గురించి తెలుసా? - ఆరోగ్య బీమా ప్రీమియం

Health Insurance Policy : ఈ రోజుల్లో సమగ్ర ఆరోగ్య బీమా అవసరం ఎంతో పెరిగింది. ఒకసారి పాలసీ తీసుకుంటే.. దాన్ని జీవితాంతం వరకు పునరుద్ధరణ చేసుకుంటూ వెళ్లినప్పుడే.. అవసరంలో అది ఆదుకుంటుంది. ఒక్కసారి ప్రీమియం ఆలస్యం చేసినా, చెల్లించకపోయినా అది అందించే ప్రయోజనాలు దూరమవుతాయి. చాలామంది ఏడాదికోసారి పునరుద్ధరణ చేసుకునేలా పాలసీలను తీసుకుంటారు. ఇటీవల కాలంలో బీమా సంస్థలు దీర్ఘకాలిక పాలసీలనూ అందిస్తున్నాయి. వీటిని ఎంచుకునేటప్పుడు ఏయే అంశాలు పరిశీలించాలన్నది చూద్దామా..

health insurance policy
ఆరోగ్య బీమా

By

Published : Dec 3, 2022, 5:52 PM IST

Updated : Dec 3, 2022, 6:16 PM IST

Long term health insurance policy : ఏడాదికోసారి కాకుండా.. రెండు లేదా మూడేళ్ల కోసం ఒకేసారి ప్రీమియం చెల్లించడం ద్వారా పాలసీలు దీర్ఘకాలం కొనసాగేలా చూసుకోవడమే ఈ బహుళ సంవత్సరాల లేదా దీర్ఘకాలిక ఆరోగ్య బీమా. వార్షిక బీమా పాలసీని ఎంచుకుంటే.. ఏడాది పాటు బీమా రక్షణ కొనసాగుతుంది. పునరుద్ధరణ చేసుకుంటేనే తిరిగి బీమా ప్రారంభం అవుతుంది. దీనికి భిన్నంగా రెండు, మూడేళ్లపాటు పాలసీని ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాలని అనుకున్నప్పుడు ఈ బహుళ సంవత్సరాల పాలసీని ఎంచుకోవచ్చు.

రాయితీలతో..
వార్షిక పాలసీలతో పోలిస్తే.. దీర్ఘకాలిక పాలసీలకు ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుందనే మాట వాస్తవం. కానీ, బీమా సంస్థలు ఈ విషయంలో పాలసీదారులకు కొన్ని ప్రయోజనాలనూ అందిస్తున్నాయి. రెండు, మూడేళ్ల వ్యవధి పాలసీని తీసుకునే వారికి ప్రత్యేక రాయితీలను అందిస్తున్నాయి. సాధారణంగా 5-10 శాతం వరకు ఈ రాయితీ అందుతోంది. బీమా సంస్థలను బట్టి, ఇది మారుతుంటుంది. పాలసీదారుడికి ఇది కొంత మేరకు ఆర్థిక ప్రయోజనమేనని చెప్పొచ్చు.

ప్రీమియం పెరిగినా..
ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చుల నేపథ్యంలో బీమా సంస్థలు ఏడాదికోసారి ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియాన్ని పెంచుతున్నాయి. రెండు, మూడేళ్ల వ్యవధి పాలసీలను ఎంచుకున్నప్పుడు.. ముందే ప్రీమియం మొత్తం చెల్లిస్తారు. కాబట్టి, ప్రీమియం పెరిగినా పాలసీదారుడికి ఇబ్బంది ఉండదు.

ఆర్థిక ఒత్తిడి లేకుండా:
అనుకోకుండా ఆదాయం కోల్పోవడం, అనారోగ్య కారణాలు తదితర క్లిష్టమైన సందర్భంలో చాలామంది పాలసీలకు ప్రీమియం చెల్లించడం ఆపేస్తుంటారు. నిజానికి కచ్చితంగా ప్రీమియం చెల్లించాల్సిన సందర్భాలివి. భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని అనుకుంటే.. డబ్బు ఉన్నప్పుడే దీర్ఘకాలిక పాలసీలను ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, ఏడాదికోసారి డబ్బును సిద్ధం చేసుకోవాల్సిన అవసరాన్నీ ఇది తప్పిస్తుంది. పన్ను ప్రయోజనం: వార్షిక ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించే ప్రీమియానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80డీ ప్రకారం మినహాయింపు లభిస్తుంది. దీర్ఘకాలిక పాలసీ తీసుకున్నప్పుడు పన్ను మినహాయింపు దామాషా ప్రకారం వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు మూడేళ్ల పాలసీకి రూ.30వేల ప్రీమియం చెల్లించారనుకుందాం. అప్పుడు ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల చొప్పున పన్ను మినహాయింపు పొందడానికి వీలుంటుంది. బీమా సంస్థ మీకు సెక్షన్‌ 80డీకి సంబంధించిన ధ్రువీకరణ అందిస్తుంది కాబట్టి, దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

వాయిదాల్లోనూ :
ఇప్పుడు ఆరోగ్య బీమా ప్రీమియాన్ని వాయిదాల్లో చెల్లించేందుకు బీమా సంస్థలు అనుమతిస్తున్నాయి. దీర్ఘకాలిక లసీలను ఎంచుకున్నప్పుడూ ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చు. కాబట్టి, ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించాలనే ఆందోళన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండాలి..

బహుళ సంవత్సరాల పాలసీ తీసుకునేటప్పుడు బీమా సంస్థ ఎంపిక, తీసుకునే పాలసీ మొత్తం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్య ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని, పాలసీ మొత్తాన్ని నిర్ణయించుకోండి. రెండు, మూడేళ్లలో వైద్య చికిత్స ఖర్చులు ఏ మేరకు పెరగవచ్చనేది ఊహించి, అందుకు అనుగుణంగా పాలసీ సరిపోతుందా లేదా చూసుకోవాలి. అదే సమయంలో పాలసీ వ్యవధి ముగిసే వరకూ వేరే సంస్థకు దీన్ని బదిలీ చేసుకోలేరు. కాబట్టి, బీమా సంస్థ ఎంపిక విషయంలోనూ అన్ని అంశాలనూ పరిశీలించాలి. చెల్లింపుల చరిత్ర, పాలసీదారులకు అందిస్తున్న సేవలను పరిశీలించండి. వార్షిక పాలసీ తీసుకున్నప్పుడూ ఇవి కీలకమే.

Last Updated : Dec 3, 2022, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details