Kisan Vikas Patra Scheme : దీర్ఘకాలంలో మెరుగైన రాబడి ఆశించే చిన్న డిపాజిటర్లకు పోస్టాఫీసులో మంచి వడ్డీరేటుతో కూడిన పథకాలు అందుబాటులో ఉన్నాయి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం.. అందులో కొన్ని. ఈ పథకాల్లో దాదాపు 7 శాతం వరకు వడ్డీరేటు లభిస్తోంది. ఈ కోవకు చెందిన మరో పథకమే 'కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)'. ప్రస్తుతం ఈ స్కీం వడ్డీరేటు 6.9 శాతంగా ఉంది. ఏటా వడ్డీని అసలులో కలుపుతారు. కాబట్టి దీర్ఘకాలంలో మన పెట్టుబడిపై చక్రవడ్డీతో కూడిన రాబడి లభిస్తుంది.
ప్రస్తుత వడ్డీరేటు వద్ద కేవీపీలో చేసిన పెట్టుబడి 124 నెలల్లో (10 ఏళ్ల 4 నెలలు) రెట్టింపవుతుంది. ఉదాహరణకు మీరు ఈరోజు రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే 124 నెలల్లో అది రూ.రెండు లక్షలు అవుతుంది. ప్రస్తుతం వివిధ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అందిస్తున్న వడ్డీరేటుతో పోలిస్తే.. కేవీపీలో లభించే వడ్డీ మెరుగ్గా ఉందని చెప్పొచ్చు!
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 1988లో ఓ స్మాల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీంగా ప్రవేశపెట్టింది. ముఖ్యంగా రైతుల్లో దీర్ఘకాల పెట్టుబడిని ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. అందుకే దీనికి కిసాన్ వికాస్ పత్రగా నామకరణం చేశారు. అయితే, దీంట్లో ఎవరైనా మదుపు చేసే అవకాశం ఉంటుంది.
కిసాన్ వికాస్ పత్ర అర్హతలు..
- భారత పౌరులై ఉండాలి.
- వయసు 18 ఏళ్లు నిండాలి.
- మైనర్ల తరఫున వయోజనులు కేవీపీ ఖాతా తెరవొచ్చు.
కేవీపీ ప్రయోజనాలు..
కచ్చితమైన రాబడి: మార్కెట్ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా కేవీపీ డిపాజిటర్లకు కచ్చితమైన రాబడి లభిస్తుంది. దీర్ఘకాలంలో నష్టభయం లేకుండా సంపద సృష్టించాలనుకునేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది.
చక్రవడ్డీ: కేవీపీలో వడ్డీరేటు ఏటా మారుతూ ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ వడ్డీరేటును 6.9 శాతంగా నిర్ణయించారు. డిపాజిట్‌పై లభించే వడ్డీని ఏటా మన అసలు మొత్తంలో కలుపుతారు. దీంతో వడ్డీపై వడ్డీ లభిస్తుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం రాబడి లభిస్తుంది.
కాలపరిమితి:ఈ స్కీం కాలపరిమితిని సైతం కేంద్ర ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ గడవు 124 నెలలుగా ఉంది. మీరు ఇప్పుడు డిపాజిట్ మొదలుపెడితే.. అది 10 ఏళ్ల 4 నెలల తర్వాత మెచ్యూర్ అవుతుంది.
ముందస్తు ఉపసంహరణ: ప్రత్యేక సందర్భాల్లో ముందుగానే డిపాజిట్లను ఉపసంహరించుకునేందుకు కిసాన్ వికాస్ పత్ర పథకంలో అవకాశం ఉంటుంది. అయితే, అప్పటి వరకు లభించిన వడ్డీని మాత్రమే చెల్లిస్తారు.