కేంద్ర ప్రభుత్వం.. జులై 1 నుంచి కొత్త కార్మిక చట్టాలను అమల్లోకి తేవాలని భావిస్తోంది. కార్మికుల కోసం కేటాయించిన మొత్తం 29 చట్టాలను కలిపి నాలుగు కోడ్‌లుగా కేంద్రం మార్చింది. ఈ కొత్త చట్టాల ప్రయోజనాలు.. ప్రైవేటు రంగ కార్మికులందరికీ అందుతాయని ప్రభుత్వం చెబుతుండగా, వీటి వల్ల కార్మికులకు, ఉద్యోగులకు వాటిల్లే నష్టం ఎక్కువని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ కొత్త చట్టం ద్వారా ఉద్యోగుల జీవితాల్లో వచ్చే ప్రధాన మార్పులేంటి? అసలు వాటి పరిస్థితేంటో చూద్దాం రండి.
రోజువారీ పని వేళలు పరిస్థితి ఏంటి?
నూతన కార్మిక చట్టాల ప్రకారం రోజువారీ పనిసమయం 12 గంటలకు పెరగనుంది. వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాలి. ప్రస్తుతం ఉన్న 8 గంటలకు బదులు 12 గంటలపాటు పనిచేయాలని కంపెనీలు ఉద్యోగులను కోరవచ్చు.
నాలుగు రోజులు పని చేస్తే వీక్లీ ఆఫ్‌లు ఎన్ని మరి?
వారంలో నాలుగు రోజులు పనిచేస్తే 3 వీక్లీ ఆఫ్‌లు ఉంటాయి. అయితే ఆ నాలుగు రోజుల్లో రోజుకు 12 గంటల పాటు పని చేయాలి. ఒకవేళ సదరు కంపెనీ 8 గంటలు మాత్రమే పనిచేయించుకుంటే వారానికి ఒకటే వీక్లీ ఆఫ్ ఉంటుంది.
జీతం పరిస్థితేంటి? మార్పు ఏమైనా ఉంటుందా?
కొత్త కోడ్ ప్రకారం ఉద్యోగి గ్రాస్ జీతంలో 50% బేసిక్ పే ఉండాలని చెబుతోంది. పీఎఫ్‌కు ఇచ్చే వాటా పెరుగుతుంది. దీంతో, కొంత మంది ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గిపోయే అవకాశముంది.
ప్రైవేటు ఉద్యోగులకు అలవెన్సులే ఎక్కువ కదా? మరెలా?
పీఎఫ్ వాటా పెరగడం వల్ల.. చేతికొచ్చే జీతం తగ్గబోతుంది. అయితే ప్రైవేటు ఉద్యోగులకు అలవెన్సులే ఎక్కువ కాబట్టి కాస్త ఇబ్బంది అవుతుంది. కొత్త కోడ్ ప్రకారం 50 శాతానికి అలవెన్సులు మించకూడదు.