Reliance Jio Unveils JioSpaceFiber :రిలయన్స్ జియో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో శుక్రవారం జియోస్పేస్‌ఫైబర్ (JioSpaceFiber) సర్వీస్‌ను విజయవంతంగా ప్రదర్శించింది. భారతదేశంలో ఇప్పటికే తొలి ఉపగ్రహ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్‌ను విజయవంతంగా అమలు చేసినట్లు ప్రకటించింది. భారత్‌లో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సదుసాయం లేని ప్రాంతాలకు దీని ద్వారా వేగవంతమైన బ్రాండ్‌బ్యాండ్ సేవలను అందించనున్నట్లు తెలిపింది.
ప్రతి ఇంటికీ ఇంటర్నెట్!
రిలయన్స్ జియో ఇప్పటికే భారత్‌లోని 45 కోట్ల మంది కస్టమర్లకు ఫిక్స్‌డ్ లైన్, వైర్‌లెస్ మార్గాల ద్వారా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవల ను అందిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలను చేరువ చేయడంలో భాగంగానే జియోఫైబర్, జియోఎయిర్‌ఫైబర్ లాంటి బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందిస్తోంది. తాజాగా వాటి సరసన జియోస్పేస్‌ఫైబర్‌ను కూడా చేర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఎలాంటి జాప్యం లేని, వేగవంతమైన ఇంటర్నెట్‌ను, ఎంటర్‌టైన్‌మెంట్ సేవలను ప్రతి ఒక్కరికీ అందిస్తున్నట్లు పేర్కొంది. తాజా శాటిలైట్ నెట్‌వర్క్‌తో జియో ట్రూ5జీ సేవలను సైతం దేశంలోని ప్రతి ప్రాంతానికి అందించనున్నట్లు రిలయన్స్ జియో స్పష్టం చేసింది.
శాటిలైట్ టెక్నాలజీ
లేటెస్ట్ ‘మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO)’ శాటిలైట్ టెక్నాలజీ కోసం.. ఎస్‌ఈఎస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. తద్వారా జియోకు ఎస్‌ఈఎస్‌కు చెందిన ఓ3బీ, ఓ3బీ ఎంపవర్ శాటిలైట్ల నెట్‌వర్క్‌కు యాక్సెస్ లభిస్తుందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్న ఏకైక సంస్థగా జియో నిలుస్తుందని పేర్కొంది.