JIO 5G Services : దసరా సందర్భంగా రిలయన్స్ జియో బుధవారం నుంచి నాలుగు నగరాల్లో 5జీ సర్వీసుల బీటా ట్రయల్‌ను నిర్వహించనుంది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసిలో ఈ బీటా ట్రయల్‌ను నిర్వహించనున్నారు. ఇందుకోసం కొంత మంది వినియోగదారులను జియో ఎంపిక చేసుకోనుంది. జియో ట్రూ 5జీ వెల్‌కమ్ ఆఫర్ కింద వారికి ఆహ్వానాలను పంపనుంది. సెకనుకు ఒక గిగాబైట్ వేగంతో ఎంపిక చేసిన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా లభించనుంది. ఈ మేరకు రిలయన్స్ జియో ఒక ప్రకటన విడుదల చేసింది.
5జీ సేవలు తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో ప్రారంభమై, వచ్చే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో భాగంగా అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇందులో నాలుగు నగరాల్లో టెలికాం సంస్థలు నేటి నుంచే 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.