82 ఏళ్ల వ్యాపార దిగ్గజం బిస్లరీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ తన సంస్థను అమ్మేస్తున్నారు. రూ.7,000 కోట్లు విలువ చేసే ఈ కంపెనీ బాధ్యతలను స్వీకరించడానికి ఆయన కుమారై జయంతి చౌహాన్ ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణం. దీంతో తన సంస్థను మరొకరికి విక్రయించడానికి రమేశ్ చౌహాన్ వివిధ సంస్థలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో అనుభవం ఉన్న దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌కు అమ్మేందుకు ఆయన ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్దిరోజుల్లో బిస్లరీ సంస్థకు కొత్త యజమాని వచ్చే అవకాశం ఉంది.
రూ.7,000కోట్ల బిజినెస్ చూసుకునేందుకు కుమార్తె నో.. కంపెనీని అమ్మేస్తున్న తండ్రి!
భారత దేశంలో ఎంతో పాపులర్ అయిన బిస్లరీ ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ సంస్థను మరొకరికి అమ్మివేస్తున్నారు కంపెనీ ఛైర్మన్ రమేశ్ చౌహాన్. రూ.7000 కోట్ల విలువ చేసే కంపెనీ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన కుమారై ఆసక్తి చూపకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
రమేశ్ చౌహాన్ కుమార్తె జయంతి చౌహాన్ తన 24వ ఏట బిస్లరీలో తన ప్రస్థానం ప్రారంభించారు. ఆమె మొదటిగా దిల్లీ కార్యాలయంలో అధికార బాధ్యతలు చేపట్టి.. కంపెనీని ముందుకు తీసుకువెళ్లడానికి అనేక మార్పులను చేశారు. కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 2011లో ముంబయి కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించిన ఆమె హెచ్ఆర్, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో చాలా మార్పులు తీసుకువచ్చారు. జయంతి హిమాలయా వేదికా నేచురల్ మినరల్ వాటర్, ఫిజ్జీ కూల్ డ్రింక్స్, బిస్లరీ హ్యాండ్ ఫ్యూరిఫయర్ వంటి ఉత్పత్తులు తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించారు. ప్రస్తుతం జయంతి సేల్స్, మార్కెటింగ్ టీమ్‌లకు నాయకత్వం వహిస్తున్నారు. జయంతి లండన్ కాలేజీ ఆఫ్ ఫ్యాషన్ కాలేజీలో ఫొటోగ్రఫీలో పట్టాపొందారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్‌లో మరో డిగ్రీని పొందారు.
రమేశ్ చౌహాన్ 1969లో ఓ ఇటాలియన్ వ్యాపారవేత్త నుంచి బిస్లరీ బ్రాండ్‌ను కొనుగోలు చేశారు. దాదాపు 50 సంవత్సరాలు చౌహాన్ నాయకత్వంలో ఉన్న బిస్లరీ ఇంటర్నేషనల్.. భారతదేశంలోనే అతిపెద్ద పానీయాల వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ 133 ప్లాంట్లు కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు.