ITR Status Check: మీరు జులై 31లోపు ఐటీఆర్ ఫైల్ చేశారా? ఇప్పుడు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? వాస్తవానికి ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తయ్యాకే రిఫండ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తరువాత రిఫండ్ మొత్తం నేరుగా మీరు తెలిపిన బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే, దీని కోసం మీ బ్యాంకు ఖాతాను పాన్ కార్డుకి లింక్ చేయడం తప్పనిసరి. గతంలోలాగా ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు చెక్కులు జారీ చేయడం లేదు. ఇంతకు ముందు ఐటీఆర్ రిఫండ్ (My ITR Status) మన ఖాతాల్లో జమ కావడానికి 7 రోజుల నుంచి 4 నెలల సమయం పట్టేది. దీనిని ఐటీఆర్ ఫైల్ చేసిన రోజు నుంచి లెక్కిస్తారు. కానీ, ప్రస్తుతం పెరిగిన సాంకేతికత కారణంగా రోజుల వ్యవధిలోనే పౌరులు తమ రిఫండ్లను పొందగలుగుతున్నారు. మరి మీకు కూడా రిఫండ్ వచ్చిందేమో ఓ సారి చెక్ చేసుకోండి ఇలా!
ఈ కింది స్టెప్స్‌ను అనుసరిస్తూ మీ రిఫండ్ స్టేటస్‌ను చెక్ చేసుకోండి.
- ముందుగా మీ యూజర్ ఐడీ (పాన్ నంబర్), పాస్‌వర్డ్‌తో https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.
- 'వ్యూ రిటర్న్స్ అండ్ ఫార్మ్స్ 'పై క్లిక్ చేయండి.
- 'ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 'ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
- తర్వాత మీ ఐటీఆర్‌కు సంబంధించి 'అసెస్మెంట్ ఇయర్'ను ఎంచుకొని సబ్మిట్ నొక్కండి.
- చివరగా ఐటీఆర్ రిఫండ్ స్టేటస్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం 'ITR Acknowledgment Number'పై క్లిక్ చేయండి.
- అప్పుడు మీ రిఫండ్ ప్రక్రియ పూర్తి అయ్యిందా? లేదా? అనేది తెలుస్తుంది.
ఒకవేళ రిఫండ్ డబ్బు జమ కాకపోతే..?
What To Do If ITR Refund Not Received: మీ రిఫండ్ డబ్బును మీ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లయితే 'రిఫండ్ పెయిడ్' అని చూపిస్తుంది. ఒకవేళ అలా రిఫండ్ అయిన అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో జమ అయినట్లు చూపించకపోతే, వెంటనే మీ బ్యాంకుని లేదా రిఫండ్ క్లెయిమ్ ప్రాసెస్ చేసే ఎస్బీఐని సంప్రదించవచ్చు. అలాగే ఆదాయ పన్ను శాఖకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ మీ రిఫండ్ ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉన్నట్లయితే.. స్టేటస్ 'ఈ-వెరిఫైడ్' అని మాత్రమే చూపిస్తుంది. ఒక వేళ మీకు కూడా ఈ-వెరిఫైడ్ అని కనిపిస్తే.. కింద తెలిపిన విధంగానూ మీ ట్యాక్స్ రిఫండ్ స్టేటస్‌ను సులువుగా తెలుసుకోవచ్చు.
- https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html అనే లింక్‌పై క్లిక్ చేసి కూడా మీ రిఫండ్ స్టేటస్ (Know ITR Refund Status)ను చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్‌ను ఓపెన్ చేసి, అడిగిన విధంగా మీ పాన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఆపై సంబంధిత అసెస్మెంట్ ఇయర్‌ను సెలక్ట్ చేసుకోండి. వెంటనే మీ రిఫండ్ స్టేటస్ గురించి పూర్తి సమాచారం మీకు కనబడుతుంది.
50 శాతం మంది ఖాతాల్లోకి..
ITR Refund In 2023 : 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్)లను దాఖలు చేసిన వారు ప్రస్తుతం రిఫండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎటువంటి పెనాల్టీ లేకుండా జులై 31 వరకు ఐటీఆర్‌లు ఫైల్ చేయడానికి అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ ప్రకారం.. జులై 31 నాటికి 6.77 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. 5.63 కోట్ల ఐటీఆర్‌లను ఇప్పటికే ఈ-వెరిఫై చేశారు. ఇందులో దాదాపు 3.44 కోట్ల ఐటీఆర్‌లను ప్రాసెస్ చేశారు. అంటే ఇప్పటికే 50 శాతానికి పైనే పన్ను చెల్లింపుదారులు తమ రిఫండ్లను స్వీకరించడం జరిగింది.