ITR Scam : సైబర్ నేరగాళ్లు మరో సరికొత్త మోసానికి తెరలేపారు. ఆదాయ పన్ను రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని 'ఐటీఆర్ రిఫండ్ మెసేజ్'లను పంపిస్తున్నారు. పొరపాటున ఆ మెసేజ్లోని లింక్‌ను క్లిక్ చేశారా? మీ బ్యాంకు అకౌంట్లోని సొమ్ము మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు ఖాళీ చేస్తారు. ఈ నయా మోసాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజలందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
మోసం ఎలా చేస్తారంటే?
Income tax refund scam : 2023 జులై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేసినవాళ్లు.. ఇప్పుడు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే వీళ్లను టార్గెట్ చేస్తూ, సైబర్ నేరగాళ్లు నయా మోసానికి తెగబడుతున్నారు. వీరి మోసం ఎలా ఉంటుందంటే.. 'మీకు ఇన్‌కం టాక్స్ రిఫండ్ వచ్చింది. ఒకసారి మీ బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసుకోండి' అంటూ ఒక మెసేజ్ పంపిస్తారు. లేదా 'మీ బ్యాంకు ఖాతా నంబర్ తప్పుగా నమోదైంది. వెంటనే సరిచేసుకోండి' అంటూ లింక్ పంపిస్తారు. పొరపాటున ఈ లింక్‌ను ఓపెన్ చేశారా? ఇక అంతే.. మీ బ్యాంకు అకౌంట్లోని సొమ్ము మొత్తాన్ని ఖాళీ చేస్తారు.