ITR Filing first time : ప్రభుత్వం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ ఉంది. కానీ చాలా మంది ఇంకా ఐటీఆర్ దాఖలు చేయడం లేదు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి.. అసలు ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలో వారికి తెలియకపోవడమే. ఒక వేళ మీరు కూడా ఈ లిస్ట్‌లో ఉంటే.. మరేమీ చింతించకండి. ఇది మీ కోసమే.
ITR filing process : మీరు మొదటిసారిగా ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేద్దామని అనుకుంటే.. అందుకు ఒక ప్రొసీజర్ ఉంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్లో కచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పోర్టల్‌లో మీ పేరు మీద ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తరువాత ఆదాయ పన్ను రిటర్నులను ఈ-ఫైలింగ్ చేయాలి. అయితే 80 ఏళ్లు పైబడిన వారికి మాత్రం ఈ-ఫైలింగ్ నుంచి మినహాయింపు ఉంది. వీళ్లు ఆఫ్‌లైన్‌లో ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు.
నిపుణుల సహాయం తీసుకోవచ్చు!
ఒక వేళ మీకు స్వయంగా ఐటీఆర్ దాఖలు చేయడం ఇబ్బందిగా అనిపిస్తే.. ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా టాక్స్ ఎక్స్పర్ట్ సహాయం తీసుకోవచ్చు. లేదా ప్రైవేట్ టాక్స్ ఫైలింగ్ పోర్టల్స్, మధ్యవర్తుల ద్వారా కూడా ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు.
ఐటీఆర్ ఎవరు దాఖలు చేయాలి?
Who needs to file income tax return in India : ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేయాల్సిందే. ప్రస్తుతం 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారికి ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. 61 నుంచి 80 ఏళ్లలోపు వయస్సున్న వారికి రూ.3 లక్షలు; 80 ఏళ్లు వయస్సు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది.
ITR filing last date 2023 : ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయడానికి ఆఖరు తేదీ 2023 జులై 31. కనుక ఇప్పటి వరకు ఐటీఆర్ దాఖలు చేయనివారు త్వరపడడం మంచిది.
నష్టాలను కూడా రిపోర్ట్ చేయండి
How to carry forward losses in ITR :ఒక వేళ ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు ఆర్థికంగా నష్టపోయినా కూడా కచ్చితంగా గడువు ముగిసే లోపు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఈ సంవత్సరం వచ్చిన నష్టాలను, తదిపరి సంవత్సరాల్లో వచ్చే ఆదాయంతో సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది.
మీ క్రెడిట్ కార్డు బిల్లులు, విదేశీ పర్యటనల ఖర్చు.. పరిమితికి మించి ఉన్నా కూడా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు విదేశాల్లో ఆస్తులను కలిగి ఉన్నా, లేదా విదేశాల నుంచి ఆదాయాన్ని సంపాదించి ఉన్నా కూడా కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఈ-ఫైలింగ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి?
How to register ITR online : కొత్తగా ఐటీఆర్ ఫైల్ చేద్దామని అనుకునే వాళ్లు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
- స్టెప్ 1 : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ ను ఓపెన్ చేయాలి.
- స్టెప్ 2 : న్యూ యూజర్ - రిజిస్టర్ టాబ్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3 : 10 అంకెల పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) ఎంటర్ చేయాలి.
- స్టెప్ 4 : పాన్ వెరిఫికేషన్ అయిన తరువాత, 'వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు'గా నిర్ధరణ చేసుకోవాలి.
- స్టెప్ 5 : పాన్ కార్డులో ఉన్న విధంగా మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. మీ పేరు, ఇంటి పేరు, లింగం, చిరునామా తదితర వివరాలు ఎంటర్ చేయాలి.
- స్టెప్ 6 : మీ ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. వీటి ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది.
- స్టెప్ 7 : ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఇచ్చిన తరువాత 'పాస్వర్డ్' సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇందుకోసం మీ మొబైల్, ఈ-మెయిల్‌కు రెండు ఓటీపీలు వస్తాయి. వీటిని సరిగ్గా ఎంటర్ చేస్తే.. మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
భద్రత కోసం ఈ-ఫైలింగ్ వాల్ట్‌ను ఏర్పాటు చేసుకోండి
వాస్తవానికి ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇందులో చాలా సున్నితమైన, ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ముఖ్యంగా మీ పాన్, ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతా సమాచారం, టాక్స్ మినహాయింపులు, గత ఆదాయ పన్ను రిటర్నులు మొదలైన విలువైన సమాచారం ఉంటుంది. వీటి వివరాలు ఇతరులకు తెలిస్తే.. చాలా సమస్యలు వస్తాయి. అందుకే భద్రత కోసం ఈ-ఫైలింగ్ వాల్ట్‌ను ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఈ-ఫైలింగ్ వాల్ట్ ఎనేబుల్ చేసుకోవడం వలన.. అకౌంట్లోకి లాగిన్ అయ్యే ప్రతిసారీ ఓటీపీ వస్తుంది. దీని వల్ల ఇతరులు ఎవ్వరూ అనధికారికంగా మన ఖాతాను యాక్సిస్ చేయకుండా నిరోధించవచ్చు.
ఈ-వాల్ట్ ఫెసిలిటీ ఎనేబుల్ చేసుకోవడానికి.. ముందుగా 'ప్రొఫైల్ సెట్టింగ్స్'లోకి వెళ్లాలి. తరువాత 'ఈ-ఫైలింగ్ వాల్ట్- హైయ్యర్ సెక్యూరిటీ' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మరింత భద్రత కోసం నెట్ బ్యాంకింగ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్లను యాక్సెస్ చేయడానికి ఆధార్ లింకేజీతో ఓటీపీ జనరేట్ అయ్యే విధంగా ఆప్షన్ ఎంచుకోవాలి.
అదనపు సమాచారం అప్డేట్ చేసుకోవచ్చు
భద్రతా ప్రమాణాలు అన్నీ ఎనేబుల్ చేసుకున్న తరువాత, 'యువర్ ప్రొఫైల్' సెక్షన్లోకి వచ్చి, మీ వ్యక్తిగత వివరాలు అన్నీ మళ్లీ సరిచూసుకోవచ్చు. అలాగే ఏదైనా కొత్త సమాచారం ఉన్నా.. దానిని అప్డేట్ చేసుకోవచ్చు. లేదా ఉన్న సమాచారాన్ని మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అలాగే ఆదాయ పన్ను శాఖ నుంచి మీకు వచ్చే రిఫండ్ ఏ బ్యాంకు అకౌంట్లో జమ చేయాలో కూడా మీరు ఇక్కడే నిర్ధరించవచ్చు.
- వాస్తవానికి ఆదాయ పన్ను శాఖ పోర్టల్‌లో మీ డీమ్యాట్ అకౌంట్ వివరాలు, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ వివరాలు కూడా నమోదు చేసుకోవచ్చు. కానీ ఇలా నమోదు చేయడం తప్పనిసరేమీ కాదు.
- ఒక వేళ మీరు ఐటీఆర్ దాఖలు చేయడానికి.. ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా మధ్యవర్తి సహాయం తీసుకోవాలని అనుకుంటే.. వారి వివరాలు కూడా ఈ ఖాతాలో పొందుపరచవచ్చు.
- కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ ఖాతాను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి ఇతర వ్యక్తులను మీ ప్రతినిధులుగానూ చేర్చుకోవచ్చు. ఇదే విధంగా మీరు ఇతరుల ఖాతాను పర్యవేక్షించేందుకు, నిర్వహించేందుకు వారి అనుమతి కూడా పొందవచ్చు.
చాలా ఉపయోగాలు ఉన్నాయి
Benefits of ITR filing : ఆదాయపన్ను శాఖ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఐటీఆర్ దాఖలు చేయడమే కాదు.. మునుపటి పన్ను రిటర్నులు, ఫారమ్ 26ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్)లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటితోపాటు ఐటీఆర్/ఫారమ్‌ల ధ్రువీకరణ, ఈ-ప్రొసీడింగులు, ఆధార్ ద్వారా ఇన్స్టంట్ పాన్ (ఈ-పాన్) పొందవచ్చు. అలాగే ఆదాయ పన్ను సంబంధిత సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసి, పరిష్కారం కూడా పొందవచ్చు.
మరీ ముఖ్యంగా రిఫండ్ ప్రాసెసింగ్, లోపాల సవరణ, కరెక్షన్ ఆఫ్ డిమాండ్, అప్పీల్ ఆర్డర్స్, పాన్ సంబంధిత దరఖాస్తులు, అస్సెసింగ్ ఆఫీసర్ (ఏవో) వద్ద పెండింగ్‌లో ఉన్న ఇతర దరఖాస్తుల సమస్యలను కూడా ఈ అకౌంట్ ద్వారా పరిష్కరించుకోవచ్చు.