ITR Filing Documents : మీరు ఈ సంవత్సరం ఆదాయ పన్ను రిటర్నులు (ITR) ఫైల్ చేశారా? 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఈ జులై 31 ఆఖరు తేదీ. ఐటీఆర్ ఫైల్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు మార్గాల్లోనూ చేసుకునే అవకాశం ఉంది.
ఆదాయ పన్ను రిటర్నులు చేసే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. 7 రకాలు ఐటీఆర్ దరఖాస్తులు ఉంటాయి. వాటిలో మనం ఏది నింపాలో తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే మనలో వివిధ ఆదాయ కేటగిరీల వారు ఉంటారు. వారు వారి ఆదాయ స్థాయిలను అనుసరించి, తమకు సంబంధించిన ITR form నింపాల్సి ఉంటుంది.
10 key documents for ITR filing
ఐటీఆర్ ఫైల్ చేయడానికి 10 ముఖ్యమైన పత్రాలు మన దగ్గర సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
పాన్ కార్డ్ :
ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి పాన్‌కార్డ్ తప్పనిసరి. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు జరిపినప్పుడు, అలాగే ఇళ్లు, బంగారం లాంటివి కొనుగోలు చేసినప్పుడు, మనం పాన్ కార్డును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. దీని వల్ల మనకు TDS (Tax Deducted at Source) డిడక్షన్ వాపస్ వస్తుంది.
ఆధార్ కార్డ్ :
పాన్ కార్డు లేని సందర్భంలో ఆధార్ కార్డును ఐటీఆర్ ఫైల్ చేయడానికి వినియోగించవచ్చు. వక్తిగతంగా ఆదాయ పన్ను రిటర్నులు ఫైల్ చేసేవారు సెక్షన్ 139AA of Income Tax Act ను అనుసరించి కచ్చితంగా ఆధార్ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఒక వేళ మీ వద్ద ఆధార్ కార్డ్ లేనట్లయితే కచ్చితంగా దాని కోసం దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే ఐటీఆర్ ఎన్రోల్మెంట్ ఐడీ కావాలంటే కచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాలి. మరో విషయం ఏమిటంటే, ఇప్పటికే మీకు ఆధార్ కార్డ్ ఉన్నట్లయితే దానిని ఈ జూన్ 30లోగా పాన్‌కార్డ్‌తో అనుసంధానం చేసుకోండి.
ఫామ్ 16 :
స్థిర ఆదాయం వచ్చే ఉద్యోగం చేస్తున్నవారు కచ్చితంగా ఫామ్-16ను నింపాల్సి ఉంటుంది. వాస్తవానికి దీనిని మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ లేదా యజమాని మీకు అందిస్తారు. దీని ఆధారంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ఫామ్ 16ఏ, 16బి, 16సీ :
మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ లేదా యజమాని TDS సర్టిఫికేట్లను ఇస్తారు. మీరు ఒక ఆస్తిని అమ్మినా లేదా కొన్నా లేదా అద్దె ద్వారా ఆదాయం పొందుతున్నా ఈ ఫామ్స్ అవసరమవుతాయి. ఫామ్ 16Aను టాక్స్ డిడక్టర్, ఫామ్ 16Bని చరాస్థి కొన్న వ్యక్తి, 16Cని అద్దె చెల్లిస్తున్న ఒక వ్యక్తి గానీ లేదా HUF గానీ అందిస్తారు.