దసరా నవరాత్రి పండగ సమయంలో దేశంలో వాహనాల రిటైల్ విక్రయాలు 57 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 5.4 లక్షలకు చేరినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 5 మధ్య మొత్తం వాహనాల రిటైల్ విక్రయాలు 5,39,227గా నమోదయ్యాయి. గతేడాది నవరాత్రి సమయంలో రిటైల్ విక్రయాలు 3,42,459గా ఉన్నాయి. కొవిడ్ ముందునాటి 2019 నవరాత్రి సమయంలో అమ్ముడుపోయిన 4,66,128 వాహనాలతో పోల్చినా ఈసారే ఎక్కువగా జరిగాయి. మూడేళ్ల విరామం తర్వాత వినియోగదార్లు వాహన కొనుగోళ్లకు అధికంగా మొగ్గుచూపారని ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా పేర్కొన్నారు. దీపావళి వరకు ఇదే ధోరణి కొనసాగొచ్చని అభిప్రాయపడ్డారు.
- నవరాత్రి సమయంలో ద్విచక్రవాహనాల రిటైల్ విక్రయాలు గతేడాది (2,42,213) కంటే 52.35 శాతం వృద్ధితో 3,69,020కు చేరాయి. 2019లో ఇవి 3,55,581గా ఉన్నాయి.
- ప్రయాణికుల వాహన విక్రయాలు 64,850 నుంచి 70.43 శాతం అధికమై 1,10,521 కు పెరిగాయి. వాణిజ్య వాహన విక్రయాలు 15,135 నుంచి 48.25 శాతం వృద్ధితో 22,437కు చేరాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 9,203 నుంచి 19,809కు పెరిగాయి. ట్రాక్టర్లు విక్రయాలు 11,062 నుంచి 57.66 శాతం పెరిగి 17,440కు వృద్ధి చెందాయి.
టాటా మోటార్స్ అంతర్జాతీయ విక్రయాల్లో 33 శాతం వృద్ధి: సెప్టెంబరు త్రైమాసికంలో టాటా మోటార్స్ అంతర్జాతీయ విక్రయాలు 33 శాతం పెరిగి 3,35,976గా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కంపెనీ 2,51,689 వాహనాలు విక్రయించింది. టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలు, టాటా డేవూ శ్రేణి అంతర్జాతీయ టోకు విక్రయాలు 89,055 నుంచి 16 శాతం వృద్ధితో 1,03,226కు చేరినట్లు కంపెనీ తెలిపింది. ప్రయాణికుల వాహన విక్రయాలు 1,62,634 నుంచి 2,32,750కు చేరాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) అంతర్జాతీయ విక్రయాలు 89,899 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందులో జాగ్వార్ విక్రయాలు 16,631గా, ల్యాండ్ రోవర్ విక్రయాలు 73,268 వాహనాలుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు మధ్య జేఎల్‌ఆర్ 78,251 వాహనాలు విక్రయించింది.