IT Refund Status: సాధారణంగా ఉద్యోగులు ఫారం-16లో పేర్కొన్న వివరాల ఆధారంగానే రిటర్నులు దాఖలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఫారం-16లో పేర్కొన్న మినహాయింపులను మించి, క్లెయిం చేసుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఆదాయపు పన్ను శాఖ ఆయా రిటర్నులను 'స్క్రూటినీ' కోసం ఎంపిక చేసే ఆస్కారం ఉంది. ఇలా ఎంపిక చేసిన అసెసీలకు దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ-మెయిల్ పంపించడం, మొబైల్‌కు సంక్షిప్త సందేశాన్ని పంపిస్తుంది. ఫారం-16లో పేర్కొన వివరాలకు, రిటర్నులలో నమోదు చేసిన వివరాల మధ్య తేడా ఉన్నప్పుడు ఈ హెచ్చరిక సమాచారం అందుతుంది.
ఇది ఆదాయపు పన్ను విభాగం నుంచి ఎలాంటి మానవ ప్రమేయం లేకుండానే ఈ నోటీసులు వచ్చేలా ఆదాయపు పన్ను పోర్టల్‌లో ఏర్పాటు ఉంది. ఈ ఆటోమేటెడ్ సమాచారం వచ్చిన తర్వాత 15 రోజుల్లోగా అసెసీ దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇ-మెయిల్, ఎస్‌ఎమ్‌ఎస్ రాకున్నా సరే.. ఒకసారి ఆదాయపు పన్ను వెబ్‌సైటులోకి వెళ్లి 'పెండింగ్ యాక్షన్/వర్క్‌లిస్ట్'లో తనిఖీ చేసుకోండి. మీరు క్లెయిమ్ చేసిన రిఫండు సరైనదే అయితే.. ఆ వివరాలను పేర్కొనండి. లేదా రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుంది. తప్పు సమాచారంతో రిఫండును క్లెయిమ్ చేసుకున్నప్పుడు అపరాధ రుసుము చెల్లించాల్సి రావచ్చు. ఇది దాదాపు రిఫండుపై 200 శాతం వరకూ ఉండే అవకాశం ఉంది.
భవిష్యత్తులో చిక్కులు రాకుండా.. ఫారం-16లో పేర్కొనని మినహాయింపులను క్లెయిం చేసుకున్నప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. కొన్నిసార్లు ఆటోమేటెడ్ నోటీసులకు బదులు ఆదాయపు పన్ను అధికారుల నుంచే నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అరుదుగానే జరుగుతుంది. కానీ, దీని తీవ్రత అధికంగా ఉంటుంది. మీరు క్లెయిమ్ చేసుకున్న మినహాయింపుల ఆధారాలన్నీ ఆదాయపు పన్ను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా 80జీ మినహాయింపుల విషయంలో ఇలాంటిది ఎదురవుతుంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్త అవసరం. రిఫండు రాని వారు ఒకసారి ఆదాయపు పన్ను పోర్టల్‌లో నోటీసు వచ్చిందా అనేది చూసుకోవడం వల్ల భవిష్యత్తులో చిక్కులు రాకుండా చూసుకోవచ్చు.