IT Jobs Salary In India :ఐటీ పరిశ్రమలో స్తబ్దత వల్ల ప్రస్తుతం ఆ రంగం సవాళ్లతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే, ఇప్పటికీ చాలా మంది విద్యార్థుల కలల రంగం ఐటీనే. ఐటీ ఉద్యోగం చేస్తూ కార్పొరేట్ లైఫ్ ఎంజాయ్ చేయాలని అందరూ అనుకుంటుంటారు. అయితే, ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో ఐటీ రంగంలోని కంపెనీలు చాలా కాలం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాయి. కొత్తగా ఉద్యోగంలోకి చేరే వారికి అతి తక్కువ శాలరీలు ఇస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే, ఏ ఉద్యోగి అయినా ఎక్కువ శాలరీ పొందాలంటే ఏం చేయాలో ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ (సీహెచ్ఆర్ఓ) మిలింద్ లక్కాడ్ చెప్పారు. అతి తక్కువ ప్రారంభ వేతనాలకు కారణాలను సైతం వివరించారు.
"ఫ్రెషర్ అయినా అనుభవం ఉన్న ఉద్యోగులైనా ఎక్కువ వేతనం పొందాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి. ఫ్రెషర్స్‌కు చాలా కాలం నుంచి రూ.3-4లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. ట్యాలెంట్‌ను బట్టి మేం వేతనాలు చెల్లిస్తున్నాం. ఏ ఉద్యోగి అయినా తన నైపుణ్యం పెంచుకుంటే వారు రెట్టింపు వేతనం పొందొచ్చు. శాలరీ రూ.10 లక్షల వరకు చేరొచ్చు. ఇన్నోవేటర్లకు మేం రూ.10 లక్షల వరకు చెల్లిస్తున్నాం. ఎన్ఐటీ, ఐఐటీల నుంచి నియమించుకుంటున్న ఉద్యోగులకు భారీగా చెల్లిస్తున్నాం."
-మిలింద్ లక్కాడ్, టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్
కాగా, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నట్లు 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టీసీఎస్ ప్రకటించింది. 5,680 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ప్రస్తుతం 603,305 మంది ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారని వెల్లడించింది. అయితే, తొలగింపులు ఇంకా కొనసాగుతాయని మిలింద్ వివరించారు. 'ఉద్యోగుల సంఖ్య విషయానికి వస్తే కంపెనీ దీర్ఘదృష్టితో చూడాల్సి ఉంటుంది. 2022, 2023 ఆర్థిక సంవత్సరాలలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను చేర్చుకున్నాం. గత మూడు త్రైమాసికాల్లో ఈ సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నాం. దీన్ని కొనసాగిస్తూనే ఉంటాం' అని మిలింద్ స్పష్టం చేశారు.