IT companies work from home: రెండేళ్లుగా ఇంటి నుంచి పని చేసిన ఐటీ ఉద్యోగులు మళ్లీ కార్యాలయాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా మహమ్మారి ముప్పు తగ్గిపోవటంతో గతంలో మాదిరిగానే కార్యాలయాల నుంచి పనికి ఐటీ కంపెనీలకు శ్రీకారం చుడుతున్నాయి. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపిస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే..., ఉద్యోగులకు ఆహ్వానం పలుకుతూ సందడిగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఐటీ పరిశ్రమ సంఘాలు, ఐటీ రంగం మీద ఆధారపడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలూ ఉద్యోగులు కార్యాలయాలకు వస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Hyderabad IT companies offices: పూర్తిస్థాయిలో వారంలో అన్ని రోజులు కార్యాలయాల నుంచి పనిచేయటం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చని ఐటీ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతానికి హైబ్రిడ్ వర్క్ పద్ధతిని (వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి, మిగిలిన రోజుల్లో ఆఫీసు నుంచి పనిచేయటం) మెజార్టీ ఐటీ కంపెనీలు అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్‌లో 5 లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో 'ఇంటి నుంచి పని' చేసే అవకాశం లభించడంతో చాలా మంది తమ స్వస్థలాలకు వెళ్లారు. అందులో ఇంకా ఎంతో మంది హైదరాబాద్ తిరిగి రావలసి ఉంది. కంపెనీలు పిలుస్తున్నందున ఇప్పుడిప్పుడే కొంతమంది వెనక్కి వస్తున్నారు. మరికొందరు తమకు ఇంకా సమయం కావాలని, అప్పటి వరకూ పూర్తిగా 'ఇంటి నుంచి పని' చేసే అవకాశం కల్పించాలని తమ తమ కంపెనీలను కోరుతున్నట్లు తెలుస్తోంది.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం .... టీసీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాల్లో ఇంతకు ముందే స్పష్టం చేసినట్లు ‘హైబ్రిడ్ వర్క్’ విధానాన్ని అమలు చేసేందుకు మొగ్గు చూపుతోంది. కానీ సీనియర్ ఉద్యోగులను, ఆఫీసుల నుంచి పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న ఐటీ ప్రాజెక్టులపై పనిచేస్తున్న ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సైతం హైబ్రిడ్ పని విధానానికే మొగ్గు చూపుతోంది. ఇంటి నుంచి కొన్ని రోజులు, ఆఫీసుకు వచ్చి కొన్ని రోజులు పనిచేయాల్సిందిగా ఉద్యోగులకు సూచిస్తోంది. ఐబీఎంలో ఇప్పటికీ మెజార్టీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దశల వారీగా కార్యాలయాలకు సిబ్బందిని పిలిపించేందుకు ఇన్ఫోసిస్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 50 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేసే విధంగా ఇన్ఫోసిస్ యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కాగ్నిజెంట్, మరికొన్ని ఇతర అగ్రశ్రేణి కంపెనీలూ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు.