అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీల్లో మానసిక రుగ్మతల చికిత్సకూ పరిహారం ఇచ్చేలా నిబంధనలు మార్చుకోవాలని భారతీయ బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అక్టోబరు 31 లోపు పూర్తి చేయాలని తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మానసిక ఆరోగ్య చట్టం, 2017లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా బీమా సంస్థలు ఎలాంటి మినహాయింపులూ లేకుండా బీమాను వర్తింపచేయాలని సూచించింది.
మానసిక రుగ్మతలకూ బీమా.. మినహాయింపులు లేకుండానే పరిహారం!
మానసిక రుగ్మతల చికిత్సకు ఎలాంటి మినహాయింపులు లేకుండా పరిహారం చెల్లించేలా నిబంధనలు మార్చుకోవాలని బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 31 లోపు ఈ ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ చట్టం మే 5, 2018 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. బీమా సంస్థలు సాధారణ చికిత్సలకు వర్తింపచేస్తున్నట్లే.. మానసిక రుగ్మతల చికిత్సకు ఎలాంటి మినహాయింపులూ లేకుండా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. నియంత్రణ సంస్థ ఆగస్టు 2018లో ఈ విషయంలో బీమా సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేసింది. అయినప్పటికీ చాలా బీమా సంస్థలు తమ పాలసీల్లో మానసిక వ్యాధుల చికిత్సలకు పరిహారం ఇవ్వడం లేదు. నవజాత శిశువులకూ, పుట్టుకతోనే లోపాలున్న పిల్లలకూ బీమా వర్తింపచేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఈ విషయంలోనూ ఈ ఏడాది ప్రారంభంలో ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటించాలని మరోసారి బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ సూచించింది.