Iran India Gas Deal : పెర్షియన్ గల్ఫ్(ఇరాన్)లో భారతీయ సంస్థలు గుర్తించిన ఫర్జాద్-బి గ్యాస్ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంలో 30% వాటాను ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్, దాని భాగస్వాములకు ఇచ్చేందుకు ఇరాన్ సిద్ధమైంది. ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్‌జీసీ) అనుబంధ సంస్థే ఓఎన్‌జీసీ విదేశ్. 2008లో ఫార్సి ఆఫ్‌షోర్ క్షేత్రంలో, 3,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో అతిపెద్ద గ్యాస్ నిక్షేపాలను ఓఎన్‌జీసీ విదేశ్ కనుగొంది.
2011 ఏప్రిల్‌లో ఫర్జాద్-బి క్షేత్రానికి సంబంధించిన మాస్టర్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎండీపీ)ను సంస్థ సమర్పించింది. అయితే అణు ప్రణాళికలపై ఇరాన్ వైఖరికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో, ఆ క్షేత్రంలో ఉత్పత్తికి సంబంధించిన చర్చలు ఆగిపోయాయి. మళ్లీ 2015లో మరోసారి ఈ అంశం తెరమీదకొచ్చింది. 2020 ఫిబ్రవరిలో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను స్థానిక సంస్థకు అప్పజెప్పాలని ఇరాన్ ప్రభుత్వం సూచించిందని నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ (ఎన్‌ఐఓసీ) పేర్కొంది.
అయితే ఎక్స్‌ప్లోరేషన్ ఒప్పందం ప్రకారం, గ్యాస్ క్షేత్రాన్ని కనుగొన్న ఓఎన్‌జీసీ విదేశ్, దాని అనుబంధ సంస్థలకు క్షేత్రం అభివృద్ధిలోనూ భాగస్వామ్యం కల్పించాలి. దీంతో భారతీయ సంస్థల బృందానికి కనీసం 30 శాతం వాటా అప్పగించేందుకు ఇరాన్ ప్రతిపాదించింది. దీనిపై 90 రోజుల లోపు స్పందించకపోతే, ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు భావిస్తామని వెల్లడించింది.
ఫార్సి ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ బ్లాక్‌లో ఓఎన్‌జీసీ విదేశ్‌కు 40 శాతం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు 40 శాతం, ఆయిల్ ఇండియాకు మిగతా 20 శాతం వాటా ఉంది.