Petrol Diesel Price: అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా రేట్లను సవరించని కారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.18,480 కోట్ల నికర నష్టాల్ని మూటగట్టుకున్నాయి. సమీక్షా త్రైమాసికంలో ఐఓసీ రూ.1,995.3 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ.10,196.94 కోట్లు, బీపీసీఎల్ రూ.6,290.8 కోట్ల నష్టాలను నివేదించాయి.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దిగుమతి చేసుకున్న బ్యారెల్ చమురు సగటు ధర రూ.109 డాలర్లుగా నమోదైంది. అయినప్పటికీ దేశీయ సంస్థలు 85-86 డాలర్లకు అనుగుణంగానే పెట్రోల్, డీజిల్‌ను విక్రయించాయి. దీంతో కంపెనీలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని సంస్థలు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్నాయి. అయితే, ధరల సవరణ పూర్తిగా కంపెనీల నిర్ణయమని ప్రభుత్వం పలు సందర్భాల్లో తెలిపింది. మరి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా రేట్లను ఎందుకు సవరించలేదన్న విషయాన్ని మాత్రం కంపెనీలు వెల్లడించలేదు.