Investments in gold: ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారంపై భారీగా రాబడులు రాకపోవచ్చు. కానీ, సంక్షోభాల సమయంలో ఇతర పథకాలతో పోలిస్తే పసిడే ఎక్కువగా ప్రకాశిస్తుంది. అందుకే, ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ విలువలతో సంబంధం లేకుండా.. అన్ని దేశాల్లోనూ బంగారానికి గిరాకీ ఉంటుంది. పసిడి సరఫరా పరిమితంగా ఉన్న నేపథ్యంలో కరెన్సీ విలువ తగ్గినట్లు.. దీని విలువ తగ్గదు. పైగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా ప్రతికూల పరిణామాలు ఉన్నప్పుడు.. బంగారం ధరలు పెరుగుతూ ఉండటం చూస్తుంటాం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ దీని ధరలోనూ వృద్ధి కనిపిస్తోంది.
10 శాతం లోపే..
పెట్టుబడుల్లో వైవిధ్యం కొనసాగించేందుకు పసిడిలో పెట్టుబడి అవసరం. మొత్తం పోర్ట్‌ఫోలియోలో దీనికి కేటాయించే మొత్తం 5 -10 శాతం లోపే ఉండేలా చూసుకోవాలి. నగల రూపంలో అవసరమైనప్పుడు బంగారం కొనుగోలు చేయొచ్చు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్‌లు, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్లను ఎంచుకోవచ్చు. సార్వభౌమ పసిడి బాండ్లలో పెట్టుబడి వల్ల ఆరు నెలలకోసారి వడ్డీ కూడా అందుతుంది. పెట్టుబడి వృద్ధికీ అవకాశం ఉంటుంది.
ఈటీఎఫ్ ఎంచుకుంటే..
బంగారాన్ని నేరుగా కొనాల్సిన అవసరం లేకుండా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) వెసులుబాటు కల్పిస్తాయి. దేశీయ బంగారం ధరలకు ఇవి అంతర్లీనంగా అనుసంధానమై ఉంటాయి. కాబట్టి, వీటిలో మదుపు చేసినప్పుడు బంగారంలో పెట్టినట్లుగానే భావించాలి. డీమ్యాట్ ఖాతా ద్వారా వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి, భద్రతకు బెంగ ఉండదు. ఒక యూనిట్ ధర గ్రాము బంగారానికి సమానంగా ఉంటుంది. కాబట్టి, కాస్త అధిక మొత్తంలో మదుపు చేయాల్సి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా గోల్డ్ ఫండ్లు లేదా గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇవి సాధారణ మ్యూచువల్ ఫండ్లలా పనిచేస్తాయి. కనీసం రూ.100తోనూ ఇందులో మదుపు చేయొచ్చు.