స్టాక్ మార్కెట్ ఎన్నో మంచీ చెడులను చూస్తుంటుంది. మాంద్యం, మహమ్మారి, యుద్ధాలు, రాజకీయ తిరుగుబాట్లు.. ఇలా ఎన్ని ప్రతికూలతలు ఉన్నా.. తిరిగి బలం పుంజుకుంటూనే ఉంటుంది. తాత్కాలికంగా నష్టపోయినా.. దీర్ఘకాలంలో మళ్లీ జీవన కాల గరిష్ఠాలను నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. అందుకే, యుద్ధ భయాలు, ఇతర ఆందోళనలను అధిగమించి మదుపును కొనసాగిస్తూనే ఉండాలి.
అస్థిరంగా ఉన్నా:మార్కెట్ అస్థిరంగా ఉందన్న మాట వాస్తవం. కానీ, పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఇదొక్కటే కారణం కాకూడదు. పెట్టుబడి పెట్టేటప్పుడే కొంత దిద్దుబాటుకు సిద్ధంగా ఉండాలన్నది మర్చిపోకూడదు. మీ లక్ష్యాన్ని సాధించడం లేదా మరేదైన బలమైన కారణం ఉంటేనే పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలి. రష్యా, ఉక్రెయిన్‌లు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న కంపెనీల్లో షేర్లు ఉంటే వాటి నుంచి బయటకు రావచ్చు. అంతేకానీ, చిన్న చిన్న కారణాలు చూపకూడదు. మీ డీమ్యాట్ ఖాతాలో పెట్టుబడులు ఎరుపు రంగులో కనిపించినంత మాత్రాన అదే శాశ్వతం కాదు అని గుర్తుంచుకోండి. భయపడితే.. దీర్ఘకాలిక లాభాలను కోల్పోతాం. మీ లక్ష్యాలు సాధించే వరకూ పెట్టుబడిని కొనసాగిస్తూనే ఉండాలి.
వైవిధ్యమే రక్ష:ఒకే పథకంలో మదుపు చేయడం ఎప్పుడూ ఇబ్బందే. పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడుల్లో వైవిధ్యం చూపాలి. మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ప్రావిడెంట్ ఫండ్, స్థిరాస్తి, బంగారం, బాండ్లు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు ఇలా వైవిధ్యంగా మదుపు వ్యూహం ఉండాలి. లక్ష్యం ఆధారంగా సరైన పెట్టుబడుల మిశ్రమం ఉన్నప్పుడే ఆర్థికంగా బలోపేతం అవుతారు.