యువకులు అధికంగా ఉన్న దేశం భారత్. 35 ఏళ్లలోపు వారు 65 శాతం వరకు ఉన్నారు. కానీ, ఆర్థిక ప్రణాళికల విషయంలో మాత్రం వీరిలో చాలా మంది అంతగా పట్టించుకోవడం లేదని అనేక నివేదికలు చెబుతున్నాయి. మంచి అలవాట్లను వీలైనంత తొందరగా నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. అందులో డబ్బు నిర్వహణా ఒకటి అని గుర్తించాలి. చదువుకునేటప్పుడు యువకులు తల్లిదండ్రులపై ఆధారపడతారు. కానీ, ఒక్కసారి సంపాదన మొదలుపెట్టాక ప్రతీ రూపాయినీ బాధ్యతగా ఖర్చు చేసేందుకు ప్రయత్నించాలి.
50:50 ఫార్ములాతో..
తొలి జీతం బ్యాంకులో జమ కాగానే ఎంతో సంతోషంగా ఉంటుంది. చాలా మంది యువకులు ఈ జీతాన్ని ఖర్చు చేసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ, మొదటి నెల జీతం వచ్చిన నాటి నుంచే 50:50 సూత్రాన్ని ఆచరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీ ఆదాయంలో 50 శాతం పొదుపు చేయండి. మిగిలిన 50 శాతం ఖర్చు చేయండి. దీని వల్ల మీరు భవిష్యత్తులో కావాల్సిన విధంగా జీవించేందుకు తోడ్పాటు లభిస్తుంది. మీరు దాచిపెట్టిన సగం జీతాన్ని ముందుగా ఎలాంటి నష్టభయం లేని పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల ప్రాథమికంగా మీ దగ్గర కొంత డబ్బు జమ అవుతుంది. ఒక్కసారి మీ ఆర్థిక లక్ష్యాలు, నష్టభయం భరించే సామర్థ్యం గురించి అవగాహన వచ్చిన తర్వాత అధిక రాబడి వచ్చే పథకాలను పరిశీలించవచ్చు.
లక్ష్యం ఆధారంగా..
మీ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణను సాధించడంలో ఇదే ముఖ్యమైన దశ. ఒక పెట్టుబడిని నిర్ణీత లక్ష్యంతో అనుసంధానం చేసినప్పుడే దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించగలం. లేకపోతే.. ఏదో పెట్టుబడి పెట్టాలి కదా అని ప్రారంభించడం, మధ్యలోనే ఆపేయడం అలవాటు అవుతుంది. అందుకే స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను గుర్తించండి. వాటిని సాధించేందుకు తగిన పెట్టుబడి మార్గాలను ఎంచుకొని, మదుపు ప్రారంభించండి.
అవసరమైన వెంటనే నగదుగా మార్చుకునే పథకాలను ఎంచుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. స్వల్పకాలిక లక్ష్యాలకు ఇవి సరైనవే. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇవి ఏ మాత్రం సరిపోవనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి దీర్ఘకాలం కొనసాగే వాటినే ఎంచుకోవాలి.