Investment for Tax Saving:ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు తగిన ప్రణాళికలు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో అందరూ పన్ను మినహాయింపు లభించే పథకాల్లో ఎంత మేరకు పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతోనే ఉంటారు. ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు కేవలం పన్ను మినహాయింపు ఒక్కటే లక్ష్యం కాకూడదు. భవిష్యత్‌లో మన అవసరాలనూ అది తీర్చేలా ఉండాలి. అందుకోసం ఏం చేయాలో చూద్దాం..
మనదగ్గర మిగులు మొత్తాన్నంతా పన్ను ఆదా పథకాల్లోకి మళ్లించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఉదాహరణకు మీ దగ్గర పెట్టుబడి కోసం రూ.5లక్షలున్నాయనుకుందాం. వీటిని సెక్షన్ 80సీ పరిధిలో ఉండే పథకాల్లోనే మదుపు చేసేందుకు వీలుంది. కానీ, ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా రూ.1,50,000 వరకే మినహాయింపు కోసం అనుమతి ఉంటుంది. మదుపు చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఉంటుంది. కాబట్టి, దీనికోసం ఎంత చెల్లిస్తున్నారో చూసుకొని, ఆ తరువాత అవసరమైన మొత్తాన్నే పన్ను ఆదా పథకాలకు మళ్లించాలి. పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్, పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, జీవిత బీమా ప్రీమియం, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం, జాతీయ పొదుపు పత్రాల వంటివి ఇందులో ఉంటాయి. సెక్షన్ 80సీ పరిమితి రూ.1,50,000 మించీ వీటిలో మదుపు చేసుకునే వీలుంది. ఈఎల్‌ఎస్‌ఎస్ మినహా మిగతావన్నీ సురక్షిత పథకాలే.
చిన్న వయసులో ఉన్న వారు పన్ను ఆదా కోసం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్) పరిశీలించవచ్చు. వీటికి మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. నష్టాన్ని భరించే శక్తి అధికంగా ఉన్నవారికి ఇవి సరిపోతాయి. మధ్య వయసులో ఉన్న వారు.. కొంత మొత్తాన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు కేటాయించి, మిగతాది సురక్షిత పథకాల్లో మదుపు చేయాలి. రూ.50,000 వరకూ ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అదనంగా పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగులు మొత్తం అధికంగా ఉండి, 25-30 శాతానికి మించి పన్ను శ్లాబులో ఉన్నవారు దీన్ని పరిశీలించాలి.