పొదుపు చేయలేకపోతున్నాం.. చాలామంది నోట వినిపించే మాట ఇదే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. పొదుపు చేయలేకపోతున్నారంటే.. ఖర్చులను సరిగా అంచనా వేయడం లేదని అర్థం. మీరు సంపాదించిన డబ్బు ఎక్కడికి వెళ్తోంది అన్నది సరిగా తెలుసుకుంటే చాలు.. సమస్య తీరినట్లే. అందుకే, ప్రతి ఖర్చుకూ ఒక లెక్క ఉండాలి. చిల్లర మొత్తమైనా సరిగ్గా రాసి పెట్టాలి. ఇది అంత తేలికేమీ కాదు.. కొందరు ఒకటి రెండు రోజులు ఈ లెక్కలు రాస్తే.. మరికొందరు వారం, పది రోజుల తర్వాత ఆపేస్తారు. కనీసం మూడు నెలల వరకైనా ఈ ఖర్చుల పద్దు ఉంటే తప్ప మనకు ఆర్థిక క్రమశిక్షణ అలవాటు కాదు. అప్పుడే ఖర్చులు తగ్గి, పొదుపు పెరిగే మార్గం కనిపిస్తుంది.
అప్పులు తీర్చాకే:పెట్టుబడులు ప్రారంభించే ముందు.. ఒకసారి మీ అప్పుల సంగతి చూసుకోండి. అధిక వడ్డీ రుణాలను తీర్చకుండా.. మదుపు చేసినా ఫలితం ఉండదు. ఆర్థిక స్వేచ్ఛకు అప్పులు అడ్డంకులు సృష్టిస్తాయని మర్చిపోవద్దు. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుంటే.. దాదాపు 24 శాతం వరకూ వార్షిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీన్ని తీర్చకుండా.. ఏ పెట్టుబడి పెట్టినా.. ఇంతకు మించి రాబడిని ఆర్జించడం అంత తేలిక కాదు. 12 శాతం వడ్డీ విధిస్తున్న రుణం ఉన్నా.. రాబడి 12 శాతమే వస్తే... మిగిలేదేమీ ఉండదు. వీలైనంత వరకూ ముందు అప్పులు తీర్చడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే మదుపు గురించి ఆలోచన.
మీ కోసం ఏం చేయాలి?:డబ్బు కోసం మీరు కష్టపడుతున్నారు. ఆ డబ్బు మీకోసం ఏం చేయాలని అనుకుంటున్నారు? ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. అప్పుడే కష్టపడి పొదుపు చేస్తున్న మొత్తాన్ని అర్థవంతంగా మదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. భవిష్యత్ కోసం డబ్బులు ఎలా అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికే పెట్టుబడులు ప్రారంభించాలి. ప్రతి రూపాయినీ మీ ఆర్థిక లక్ష్యంతో ముడిపెట్టాలి. పిల్లల చదువులు, వారి ఇతర ఖర్చులు, మీ పదవీ విరమణ ప్రణాళికలు.. ఇలా ప్రతి లక్ష్యానికీ విడివిడిగా పెట్టుబడులు కేటాయించాలి. దీర్ఘకాలంలో డబ్బు మరింత డబ్బును సంపాదించేలా పథకాలను ఎంచుకోవాలి. నష్టభయం ఉన్న పథకాల ఎంపికలో జాగ్రత్త తప్పనిసరి.