Jim Rogers on Inflation: భారత్ సహా ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో.. సింగపూర్‌కు చెందిన ప్రముఖ పెట్టుబడిదారు, ఆర్థిక నిపుణులు జిమ్ రోగర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1970ల్లో మాదిరే వడ్డీ రేట్లు పెరగొచ్చని అంటున్నారు. బంగారం, వెండి వంటి కమొడిటీలే పెట్టుబడులకు శ్రేయస్కరమని ఆయన చెప్పారు. మరో 3-4 సంవత్సరాలు ద్రవ్యోల్బణ సమస్య తీవ్రంగానే ఉండొచ్చని జిమ్ వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారో చూద్దాం.
కమొడిటీలపై ఇంకా బులిష్‌గానే ఉన్నారా..?
బాండ్ల ధర మరీ ఎక్కువగా ఉంది. అందుకే కమొడిటీలనే కొంటున్నా. దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌తో పాటు భారత్, ఇతర దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్థిరాస్తిలో బుడగలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా పేలవచ్చు. ఇది స్టాక్ మార్కెట్లోనూ కనిపించొచ్చు. మొత్తం కాకపోయినా.. కొన్ని షేర్లలో కనిపించవచ్చు. కమొడిటీలే ఇప్పటిదాకా చవగ్గా ఉన్నాయి. వెండి తన ఆల్‌టైం గరిష్ఠాల నుంచి 60% తగ్గింది. చాలా వరకు కమొడిటీలు వాటి ఆల్‌టైం గరిష్ఠాలకు చాలా దిగువన ఉన్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఎంత మేర ఉండొచ్చంటారు.?
అమెరికాకు ఆర్థిక సమస్య వచ్చి 13 ఏళ్లయింది. అమెరికా చరిత్రలో ఇది చాలా ఎక్కువ సమయం. ప్రపంచం మొత్తం కూడా తీవ్రమైన ఆర్థిక సమస్యలు లేకుండా ఎక్కువ కాలం గడిపింది. మనకు మళ్లీ ఆర్థిక సమస్య రాకపోవచ్చు అని అంటున్నారు కానీ నాకు కొన్ని అనుమానాలున్నాయి. మనం తీవ్ర ఆర్థిక సమస్యలకు చాలా దగ్గరగా వెళుతున్నామనిపిస్తోంది.
కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్లడంపై మీ అభిప్రాయం.
కేంద్ర బ్యాంకుల నిర్వాహకులు మరీ తెలివైనవారేమీ కాదన్నది నా ఉద్దేశం. భారత రిజర్వ్ బ్యాంకుకు కొన్నేళ్ల కిందట తెలివైన గవర్నర్ ఉండేవారు. ఇపుడాయన అమెరికాలో ఉన్నారు. కేంద్ర బ్యాంకుల చరిత్రలో చాలా కొద్ది మంది మాత్రమే తెలివైన గవర్నర్లున్నారు. ద్రవ్యోల్బణం లేకపోయినా.. డబ్బులు అచ్చు వేస్తున్నామని వారు(కేంద్ర బ్యాంకర్లు) అంటున్నారు. అంటే ద్రవ్యోల్బణం, నగదు ముద్రణ నియంత్రణలో లేదు. యుద్ధం ముగిసేలోపు వడ్డీ రేట్లు భారీగా పెరగొచ్చు. ఎందుకంటే వారేం చేస్తున్నారో వారికి తెలియడం లేదు.