భారత్‌లో పలు సంక్షేమ కార్యక్రమాల పేరుతో నగదు బదిలీ పథకం అమలు చేయడం ఓ అద్భుతమని అంతర్జాతీయ ద్రవ్యనిధి బుధవారం పేర్కొంది. భారత్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఐఎంఎఫ్ ఆర్థిక వ్యవహారాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ పాలో మౌరో అన్నారు. భారత ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం.. లక్షలాది మంది నిరుపేదలకు చేరుకోవడం అద్భుతమని ఆయన చెప్పారు.
"ప్రత్యేకంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అనేక పథకాలు అమలు చేస్తున్నారు. వృద్ధులు, రైతులను లక్ష్యంగా చేసుకుని వివిధ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. అందులోనూ సాంకేతిక ఆవిష్కరణలు ఉండడం గొప్ప విషయం. విశిష్ట గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్‌ను.. భారత్‌లో ఉపయోగించడం మరో అద్భుతం. చాలా దేశాల ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ లేకపోయినా.. మొబైల్ ఫోన్ ఉండడం వల్ల మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో పలు దేశాలు ఇతర దేశాలను చూసి నేర్చుకోవాలి." అని పాలో చెప్పుకొచ్చారు.