ఎలాంటి మోటారు వాహనాలకు బీమా తప్పనిసరి. ప్రమాదాలే కాకుండా, వాహనానికి ఊహించని ఘటనలు జరిగినప్పుడు ఈ బీమా పాలసీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, థర్డ్ పార్టీ బీమా మాత్రమే కాకుండా సమగ్ర కవరేజీని ఎంచుకునేటప్పుడు బీమా ప్రీమియం ఎక్కువగానే ఉంటుంది. దీన్ని తగ్గించుకునేందుకు పాలసీ కవరేజీపై పరిమితిని నిర్ణయించుకోవచ్చు. కానీ, అధిక కవరేజీ కలిగి ఉన్న పాలసీలు ఎక్కువ ఆర్థిక రక్షణను అందిస్తాయి.
కవరేజ్ పరిమితులు
ఈ పరిమితులు.. ప్రమాదం లేదా ఇతర ఘటనల సందర్భంలో మీ బీమా కంపెనీ చెల్లించే గరిష్ఠ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. సాధారణంగా మోటారు బీమా పాలసీలలో అనేక రకాల కవరేజీలు ఉంటాయి. అవి కొలిజన్, లయబిలిటీ సమగ్ర కవరేజీ వంటివి. ప్రతి రకమైన కవరేజీ దాని సొంత కవరేజీ పరిమితి కలిగి ఉండవచ్చు. ఇది ఏదైనా సంఘటన జరిగినప్పుడు బీమా కంపెనీ చెల్లించే గరిష్ఠ మొత్తాన్ని నిర్దేశిస్తుంది. ఉదా: మీకు రూ.50 వేల కవరేజీ పరిమితితో లయబిలిటీ కవరేజీ ఉందని అనుకుందాం. అనుకోకుండా కారు ప్రమాదానికి గురైనప్పుడు డ్రైవర్ మెడికల్ బిల్లులు, ఇతర ఆస్తి నష్టాల బిల్లులు రూ.50 వేలు దాటితే, దాటిన మొత్తానికి బీమా కంపెనీ బాధ్యత వహించదు. మీరు భరించవలసిందే. అదే విధంగా, మీరు రూ.10 వేల కవరేజీ పరిమితితో కొలిజన్ కవరేజీని కలిగి ఉంటే.. మీ కారు ప్రమాదంలో రూ.12 వేల నష్టాన్ని కలిగించినట్లయితే, అదనంగా రూ.2 వేల మొత్తాన్ని మాత్రమే చెల్లించే బాధ్యత మీపై ఉంటుంది.
ప్రభావితం
బీమా పాలసీలను బట్టి కవరేజీ పరిమితులు మారవచ్చు. మీ డ్రైవింగ్ రికార్డ్, మోడల్, కారు తయారీ, మీరు నివసించే రాష్ట్రం వంటి అనేక అంశాల ద్వారా ప్రభావితం కావచ్చు. బీమా పాలసీ నిబంధనలను జాగ్రత్తగా సమీక్షించడం, ప్రతి రకమైన కవరేజీకి సంబంధించిన పరిమితులను అర్థం చేసుకోవడం చాల ముఖ్యం.
కవరేజీ
కవరేజీ పరిమితులను ఎంపిక చేసుకునేటప్పుడు మీ వ్యక్తిగత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. వాహనం విలువైనది అయినప్పుడు, క్లెయిమ్ విషయంలో అధిక కవరేజీని కలిగి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో ఎక్కువ ప్రీమియం చెల్లింపులు తప్పవు. మరోవైపు, మీకు పరిమిత ఆర్థిక వనరులు ఉంటే, ప్రీమియం సరసమైనదిగా ఉండడానికి తక్కువ కవరేజీ పరిమితులను ఎంచుకోవలసి ఉంటుంది. కవరేజీ పరిమితులు అర్థం చేసుకోవడం, అవి మీ మోటారు బీమా పాలసీని ఎలా ప్రభావితం చేస్తాయనేది కవరేజీ ఎంపిక చేసుకునేటప్పుడు నిర్ణయం తీసుకోవాలి.