Infosys q4 Results: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 50,000 మందికి పైగా తాజా ఉత్తీర్ణులను (ఫ్రెషర్స్) ఉద్యోగాల్లో నియమించుకోవాలని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 55,000 మందిని నియమించుకోవాలని అనుకున్నా, 85,000 మంది ఫ్రెషర్లకు సంస్థ అవకాశమిచ్చింది. సిబ్బంది వలసల రేటు డిసెంబరు నాటి 25.5 శాతం నుంచి 27.7 శాతానికి పెరగడమే ఇందుకు కారణం. బలమైన గిరాకీ పరిస్థితుల్లో మరిన్ని కాంట్రాక్టులు లభిస్తాయన్న అంచనాతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 13-15 శాతం వృద్ధి చెందుతుందని సంస్థ పేర్కొంది. నిర్వహణ మార్జిన్లు 21-23 శాతంగా ఉండొచ్చని భావిస్తోంది. ఈ నెల నుంచి సిబ్బందికి వేతన పెంపు ఉంటుందని తెలిపింది.
జనవరి- మార్చి ఫలితాలు ఇలా..:గత ఆర్థిక సంవత్సరం నాలుగో (జనవరి- మార్చి) త్రైమాసికానికి ఇన్ఫోసిస్ ఏకీకృత ప్రాతిపదికన రూ.5,686 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాలంలో ఆర్జించిన రూ.5,076 కోట్లతో పోలిస్తే నికర లాభం 12 శాతం పెరిగింది. అక్టోబరు- డిసెంబరు త్రైమాసిక నికర లాభం రూ.5809 కోట్లతో పోలిస్తే 2 శాతం తగ్గింది. ఏడాది వ్యవధిలో ఆదాయం రూ.26,311 కోట్ల నుంచి 22.7 శాతం అధికమై రూ.32,276 కోట్లకు చేరింది. డాలరు రూపేణా సమీక్షా త్రైమాసికంలో నికర లాభం 8 శాతం పెరిగి 752 మిలియన్ డాలర్లకు, ఆదాయం 18.5 శాతం వృద్ధితో 4,280 మిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగ వాటా 59.2 శాతమని సంస్థ తెలిపింది. 2.3 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను ఇన్ఫోసిస్ దక్కించుకుంది. నిర్వహణ మార్జిన్ 24.5 శాతం నుంచి 21.5 శాతానికి తగ్గింది.
"దశాబ్దకాలంలోనే అత్యధిక వార్షిక వృద్ధిని ఇన్ఫోసిస్ నమోదుచేసింది. డిజిటల్, క్లౌడ్ విభాగాలు సహా అన్ని విభాగాలు, విపణులు మెరుగైన పనితీరు కనబర్చడం ఇందుకు దోహదం చేసింది. క్లయింట్ల డిజిటల్ ప్రయాణాన్ని మేం విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలమనే నమ్మకాన్ని చూరగొనడం వల్ల మా మార్కెట్ వాటాలో వృద్ధి కొనసాగుతోంది"
- సలీల్ పరేఖ్, ఎండీ, సీఈఓ, ఇన్ఫోసిస్