సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు స్టాక్ మార్కెట్లో సోమవారం భారీగా పడిపోయాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు 9.40 శాతం నష్టపోయి రూ.1,258.10 దగ్గర స్థిరపడింది. నిఫ్టీలో షేరు విలువ 9.37 శాతం తగ్గి రూ.1,185.30కి చేరుకుంది. ఫలితంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.59,349కోట్లు క్షీణించింది. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోకపోవడమే ఈ నష్టాలకు ప్రధాన కారణం.
అంతకుముందు.. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయంలో దాదాపు 15 శాతం మేర ఇన్ఫోసిస్ షేర్లు కుప్పకూలాయి. ఓ దశలో ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో 15 శాతం నష్టపోయి రూ.1,219 దగ్గర 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.73,060 కోట్లు తగ్గింది. చివరకు కాస్త కోలుకోగా.. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇన్ఫోసిస్ షేరు విలువ 9.4శాతం పతనమైంది.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 520 పాయింట్లు నష్టపోయి.. 59,910 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 17,706 దగ్గర ముగిసింది.
లాభనష్టాలోనివి.. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, ఎస్బీఐఎన్, కొటాక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాసెమ్కో, ఐటీసీ షేర్లు లాభాలతో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, విప్రో, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.