తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇన్ఫోసిస్‌ లాభం 11శాతం వృద్ధి.. రానున్న రోజుల్లో మాత్రం కష్టమే!

Infosys Q1 Results : ఇన్ఫోసిస్‌ 2023 మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 5,945 కోట్ల రూపాయల నికర లాభాన్ని సంస్థ నమోదు చేసింది. 11 శాతం వృద్ధి నమోదు చేసింది. మరోవైపు.. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కూడా గురువారం తన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.

infosys-q1-results-2023-infosys-q1-profit-rises-11-pc-to-rs-5945-cr
ఇన్ఫోసిస్‌ మొదటి త్రైమాసిక ఫలితాలు 2023

By

Published : Jul 20, 2023, 9:07 PM IST

Infosys Results Q1 2023 : ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తమ సంస్థ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికం(మొదటి త్రైమాసికం)లో పదకొండు శాతం వృద్ధితో.. 5,945 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది.2022లో ఇదే త్రైమాసికంలో 5,362 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఇక కంపెనీ ఆదాయం రూ.34,470 కోట్ల నుంచి రూ.37,933 కోట్లకు పెరిగినట్లు.. తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్‌ తెలిపింది.

అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాల్లో మాత్రం ఇన్ఫోసిస్‌ కోత పెట్టింది. 2023-24 సంవత్సరానికి గానూ ఆదాయ వృద్ధి 1-3.5 శాతంగా ఉండే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. అంతకుముందు కంపెనీ ఆదాయ అంచనాలను 4-7 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులే దీనికి కారణమని వివరించింది. ఆపరేటింగ్‌ మార్జిన్లలో 20-22 శాతం వృద్ధి ఉంటుందని ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 2.3 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు ఇన్ఫోసిస్‌ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 2.1 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది అధికమని పేర్కొంది. మార్చి త్రైమాసికంలో 20.9 శాతంగా ఉన్న వలసల రేటు.. 17.3 శాతానికి తగ్గినట్లు కంపెనీ వివరించింది. గత త్రైమాసికంతో పోలిస్తే జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,940 తగ్గిందని.. ప్రస్తుతం 3,36,294 మంది పనిచేస్తున్నారని ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ఫలితాల వెల్లడి నేపథ్యంలో గురువారం ఇన్ఫోసిస్‌ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 1.7 శాతం నష్టంతో 1,449.50 రూపాయల వద్ద ముగిశాయి.

6.9 శాతం వృద్ధితో రూ. 2,556 కోట్ల నికర లాభాలను నమోదు చేసిన హెచ్​యూఎల్​..
Hul Results Q1 2023 : హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కూడా గురువారం తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్​తో ముగిసిన త్రైమాసికంలో 6.9 శాతం వృద్ధితో రూ. 2,556 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,391 కోట్లుగా నమోదు చేసిందని.. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details