Infosys Narayana Murthy Book : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైన నారాయణ మూర్తిని ఓ అమెరికన్ క్లయింట్ కిటీకీలు లేని స్టోర్ రూమ్‌లో పడుకునేలా చేశాడు. వాస్తవానికి అతని ఇంట్లో నాలుగు బెడ్ రూమ్‌లు ఉన్నప్పటికీ, పాతసామానులు ఉంచే స్టోర్ రూమ్‌లో నారాయణ మార్తిని ఉంచాడు. ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించిన కొత్తల్లో జరిగిన ఈ ఘటన గురించి ప్రముఖ రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుణి తను రాసిన 'అన్‌కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధ అండ్ నారాయణ మూర్తి' పుస్తకంలో రాశారు.
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధామూర్తి - ప్రేమ, వివాహం, పిల్లల పెంపకం సహా, ఇన్ఫోసిస్ వ్యవస్థాపన, తొలినాళ్లలో వారు ఎదుర్కొన్న సవాళ్లు గురించి తెలుపుతూ చిత్రా బెనర్జీ ఈ పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని Jaggernaut Books ప్రచురించింది.
స్టోర్ రూమ్‌లో నిద్రించిన మూర్తి
'న్యూయార్క్‌లోని డేటా బేసిక్స్ కార్పొరేషన్ హెడ్ అయిన డాన్ లీల్స్ చాలా కోపిష్టి. అతనికి నారాయణ మూర్తి అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అందుకే అతను ప్రాజెక్టు పూర్తి చేయడానికి కావాల్సిన డబ్బులు నారాయణ మూర్తికి ఇచ్చేవాడు కాదు. పనిపూర్తి చేసిన తరువాత కూడా సరైన సమయానికి పేమెంట్ చేసేవాడు కాదు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు మాన్‌హట్టన్ వెళ్లినప్పుడు, వారికి కనీసం మంచి హోటల్ రూమ్స్ కూడా బుక్ చేసేవాడు కాదు.
ఒకసారి నారాయణ మూర్తి అమెరికా వెళ్లినప్పుడు, డాన్ లీల్స్ ఆయనను ఓ స్టోర్ రూమ్‌లో ఉంచాడు. వాస్తవానికి అతని ఇంట్లో నాలుగు బెడ్ రూమ్‌లు ఉన్నప్పటికీ, ఇలా అమానుషంగా ప్రవర్తించాడు. ఆ స్టోర్‌రూమ్ నిండా పాత పెట్టెలు ఉన్నాయి. అందులోని ఓ పెద్ద పెట్టె (బాక్స్)పై నారాయణ మూర్తి నిద్రపోయారు.
ఆ తరువాత డాన్ లీల్స్ చెప్పిన ప్రాజెక్ట్ పూర్తి చేయడమే కాకుండా, అతను చెప్పిన అదనపు పనులు కూడా మూర్తి పూర్తి చేయాల్సి వచ్చింది. ఇన్ఫోసిస్ సంస్థ కోసం నారాయణ మూర్తి ఇంతగా కష్టపడ్డారు. డాన్ లీల్స్ చేసిన అకృత్యాలను సహించారు. కానీ తనను స్టోర్ రూమ్‌లో ఉంచడంపై తీవ్రంగా కలత చెందారు' అని చిత్రా బెనర్జీ తన పుస్తకంలో సవివరంగా రాశారు. ఈ పుస్తకంలో ఇంకా ఏమేమి రాశారంటే?
అతిథి దేవోభవ
నారాయణ మూర్తి తనకు జరిగిన అవమానం గురించి భార్య సుధామూర్తికి చెబుతూ, "ఇంటికి వచ్చిన అతిథులను దైవంలా భావించాలని మా అమ్మ చెప్పేది. ఇంటికి వచ్చిన అతిథులతో ప్రవర్తించే విధానాన్ని అనుసరించి, అవతలి వ్యక్తులు ఎలాంటి వారో, వారి స్వభావం ఏమిటో మనం సులభంగా గుర్తించవచ్చని అనేది. ఒక్కోసారి మా నాన్నగారు ముందు చెప్పకుండా, అతిథులను ఇంటికి పిలిచేవారు. అప్పుడు మా అమ్మ తన కోసం ఉంచుకున్న ఆహారాన్ని వారికి పెట్టేవారు. ఆమె మాత్రం పస్తులతోనే పడుకునేవారు. కానీ డాన్ లీల్స్ తను బెడ్ రూమ్‌లో సౌకర్యవంతంగా పడుకొని, నన్ను మాత్రం కనీసం కిటికీలు కూడా లేని, పాత సామానులు ఉంచే స్టోర్ రూమ్‌లో ఉంచారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.