ఇటీవల కాలంలో భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నాలుగున్నర నెలల విరామం తర్వాత మార్చి నెలలో మొదలైన ఇంధన ధరల పెరుగుదల ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. అయినప్పటికీ మార్చి నెలలో దేశంలో ఇంధన వినియోగం రికార్డు స్థాయిలో జరిగింది. గడిచిన మూడేళ్లలోనే పెట్రోల్, డీజిల్ వినియోగం 4.2శాతం పెరిగి.. కొవిడ్ కంటే ముందున్న రోజులను దాటిపోయింది. దేశంలో కేవలం ఒక్క మార్చిలోనే 19.41 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం జరిగింది. పెట్రోలియం మంత్రిత్వశాఖకు చెందిన ప్లానింగ్ అండ్ అనాలసిస్ ప్రకారం, 2019 మార్చి నుంచి ఇదే అత్యధికం.
కొవిడ్ మూడోవేవ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడం వల్ల దేశవ్యాప్తంగా ఇంధన వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశంలో అత్యధికంగా వినియోగించే డీజిల్ వాడకం గణనీయంగా పెరిగింది. కేవలం ఒక్క నెలలోనే 6.7 శాతం పెరుగుదలతో 7.7మిలియన్ టన్నుల విక్రయాలు జరిగాయి. ఇలా పెట్రోల్, డీజిల్ విక్రయాలు కొవిడ్ కంటే ముందున్న అమ్మకాలను దాటిపోయాయి. వ్యవసాయ రంగంలో డీజిల్‌ను భారీగా వినియోగించడం, ధరల పెరుగుదల భయంతో పెట్రోల్ బంకుల్లో ముందస్తు నిల్వలు చేసుకోవడం వల్ల వీటికి మరింత డిమాండ్ పెరిగింది. మరోవైపు, మార్చి నెలలో వంటగ్యాస్ (LPG) డిమాండ్ కూడా 9.8శాతం పెరిగి 2.48 మిలియన్ టన్నులకు చేరింది.