తెలంగాణ

telangana

ETV Bharat / business

రూపాయి పతనం.. క్షీణిస్తున్న ఫారెక్స్​ నిల్వలు.. ఇలాగే అయితే కష్టమే! - Indian rupee value today

భారత విదేశీ మారకపు నిల్వలు భారీగా పడిపోతున్నాయి. ఏడాది వ్యవధిలో 96.45 బిలియన్ డాలర్ల నిల్వలు తగ్గిపోయాయి. రూపాయి విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో.. ఆర్​బీఐ తీసుకునే చర్యల వల్ల ఫారెక్స్ నిల్వలు మరింత తగ్గే అవకాశం ఉంది.

indias-forex-reserves-fall-to-near-two-year-low
indias-forex-reserves-fall-to-near-two-year-low

By

Published : Sep 24, 2022, 7:37 AM IST

Forex Reserves : దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు ఏడాది కాలంలో గణనీయంగా క్షీణించాయి. 2021 అక్టోబరులో 642 బిలియన్‌ డాలర్ల నిల్వలుండగా, ఈనెల 16కు అవి 545.65 బి.డా.కు తగ్గినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం వెల్లడించింది. అంటే ఏడాది వ్యవధిలో 96.45 బి.డా. మేర తగ్గిపోయాయి. 2020 అక్టోబరు 2 తరవాత ఇదే తక్కువమొత్తం. విదేశీయులు ఈక్విటీల అమ్మకం తదితర రూపాల్లో పెట్టుబడులు ఉపసంహరించి డాలర్లను పట్టుకెళ్లడం, దిగుమతుల కోసం డాలర్లలో చెల్లింపులకు తోడు రూపాయి విలువను కాపాడేందుకు డాలర్లను ఆర్‌బీఐ విక్రయించడం వంటివి ఇందుకు కారణాలు. తాజాగా డాలర్‌ విలువ రూ.81.09కి చేరడంతో, దేశీయ కరెన్సీ విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ మరిన్ని ఫారెక్స్‌ నిల్వలను విక్రయించొచ్చన్న అంచనాలున్నాయి. ఫారెక్స్‌ నిల్వలు తగ్గిపోయేకొద్దీ అంతర్జాతీయ ఆర్థిక ఒడుదొడుకులను తట్టుకోవడం మన ఆర్థిక వ్యవస్థకు కష్టం కావొచ్చని ఆర్థికవేత్తలు అంటున్నారు.

మన ఆర్థిక వ్యవస్థ ఆకర్షణీయంగా (పెట్టుబడులపై అధిక ప్రతిఫలం) ఉంటే, విదేశీయులు ఇక్కడ పెట్టుబడులు పెడతారు. అమెరికాలో వడ్డీ రేట్లు దాదాపు సున్నా స్థాయిలో ఉండటం, వర్థమాన మార్కెట్లలో భారత్‌ ఈక్విటీ మార్కెట్లు అధిక ప్రతిఫలం ఇస్తుండటంతో ఇటీవలి వరకు ఇక్కడకు డాలర్ల రూపంలో పెట్టుబడులు భారీగా తరలి వచ్చాయి. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆ దేశ కేంద్రబ్యాంక్‌ వడ్డీరేట్లు పెంచడం వల్ల, అక్కడ బాండ్లపై ప్రతిఫలం పెరుగుతోంది. దీనితో మన మార్కెట్లు వారికి తక్కువ ఆకర్షణీయంగా మారుతున్నాయి.

ఫలితంగానే ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు జరిపి, పెట్టుబడులను విదేశీయులు ఉపసంహరిస్తున్నారు. ఇందువల్ల డాలర్‌కు గిరాకీ మరింత పెరిగి, రూపాయి పతనమవుతోంది. రూపాయి విలువ తగ్గే కొద్దీ, దిగుమతులు మరింత ఖరీదవుతాయి. వాణిజ్యలోటు, కరెంటు ఖాతాలోటు పెరుగుతాయి. ఫలితంగా దిగుమతుల రూపంలో అధికమయ్యే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ కీలకరేట్లను పెంచాల్సి వస్తుంది. తదుపరి సమీక్ష అనంతరం, కీలకరేట్లను 0.5% మేర పెంచుతూ 30న ఆర్‌బీఐ ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జనవరి-జులైలో 38.7 బి.డా. అమ్మకాలు :ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించాక, అంతర్జాతీయ అనిశ్చితులు మొదలయ్యాయి. డాలర్‌కు గిరాకీ పెరుగుతున్నందున, రూపాయి విలువను పరిరక్షించేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. జనవరి-జులైలో తన ఫారెక్స్‌ నిల్వల నుంచి నికరంగా 38.8 బిలియన్‌ డాలర్లను విక్రయించింది. ఒక్క జూన్‌లోనే నికరంగా 19 బిలియన్‌ డాలర్లను అమ్మినట్లు తెలుస్తోంది. స్పాట్‌ మార్కెట్లో జోక్యం కారణంగా ఆర్‌బీఐ ఫార్వర్డ్‌ డాలర్‌ హోల్డింగ్‌లు 64 బిలియన్‌ డాలర్ల నుంచి 22 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి.

  • 2013 సంక్షోభ సమయంలోనూ (జూన్‌-సెప్టెంబరు) ఆర్‌బీఐ నికరంగా 14 బి.డాలర్లనే విక్రయించింది. ఇప్పుడు అంతకంటే అధికంగా విక్రయిస్తోంది. అప్పటితో పోలిస్తేఇప్పుడు ఫారెక్స్‌ నిల్వలు అధికంగా ఉండటమే ఊరట కలిగించే అంశం.

ప్రభావం ఎంతంటే..
ప్రస్తుతం 9 నెలల దిగుమతులకు సరిపడా ఫారెక్స్‌ నిల్వలు మన వద్ద ఉన్నాయని చెబుతున్నారు. గరిష్ఠంగా ఇవి 16 నెలలకు సరిపడా ఉండేవి. 2013లో ఈ కవరేజీ 7 నెలల కంటే దిగువకు పడిపోయింది.

నిల్వలు మరింత తగ్గొచ్చు: డాయిష్‌ బ్యాంక్‌
2022-23లో కరెంట్‌ ఖాతా లోటు 4 శాతానికి పెరిగితే, ఫారెక్స్‌ నిల్వలు 510 బిలియన్‌ డాలర్లకు దిగివస్తాయని డాయిష్‌ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. 2013 మే నాటి 300 బి.డా.తో పోల్చితే ఇది మెరుగే.

యువాన్‌ కంటే మెరుగే..
మన వాణిజ్య పోటీదార్లతో పోలిస్తే రూపాయి స్థితి బాగానే ఉందని ఆర్‌బీఐ అంటోంది. 'చైనా యువాన్‌తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూపాయి 5% వరకు బలపడింద'ని అంటున్నారు. ఇది చైనా, భారత్‌ చేసే ఎగుమతులకు అత్యంత కీలక అంశం.

రూ.4.90 లక్షల కోట్ల సంపద హాంఫట్‌
అంతర్జాతీయ మార్కెట్ల పతనంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టకష్టాలు కొనసాగాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచడం, బ్రిటన్, స్వీడన్, స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంకులూ ఇదే బాటలో నడవడం, అంతర్జాతీయంగా మదుపర్లను కలవరపెట్టింది. దేశీయంగానూ అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ ఒక్కరోజే 1020 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 17,350 పాయింట్ల దిగువకు చేరింది.డాలర్‌తో పోలిస్తే రూపాయి ఇంట్రాడేలో 81 స్థాయిని మించడం సెంటిమెంటును దెబ్బతీసింది. గురువారం ముగింపుతో పోలిస్తే, మరో 19 పైసలు బలహీనపడి 80.98 వద్ద ముగిసింది. మాంద్యం భయాలతో బ్యారెల్‌ ముడిచమురు ధర 1.87 శాతం తగ్గి 88.77 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు నీరసపడ్డాయి.

ఇదీ చదవండి:భారత్​ నుంచి విదేశీ స్టాక్స్​లో మదుపు చేయొచ్చా? లాభాలేంటి?

స్టాక్​ మార్కెట్లపై డాలర్​ దెబ్బ.. రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి

ABOUT THE AUTHOR

...view details