Crude Oil Import: ముడిచమురు ధర గణనీయంగా పెరగడం మన దేశానికి ఆర్థిక కష్టాలు తెచ్చిపెడుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో చమురు దిగుమతుల బిల్లు 119.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్ల)కు చేరిందని చమురు మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2020-21లో చమురు దిగుమతి బిల్లు 62.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.70 లక్షల కోట్ల)తో పోలిస్తే, గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపైంది. కొవిడ్ పరిణామాల్లో చమురు ధర గణనీయంగా తగ్గడం 2020-21లో మన దిగుమతి బిల్లు తగ్గేందుకు కారణమైంది. అప్పుడు వినియోగం కూడా తక్కువగానే జరిగింది. ప్రపంచంలోనే చమురును అధికంగా వినియోగించే, దిగుమతి చేసుకునే దేశాల్లో మూడో స్థానంలో మన దేశం ఉంది. దేశీయ చమురు అవసరాల్లో 85.5 శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. గత నెలలోనే చమురు దిగుమతుల బిల్లు 13.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.03 లక్షల కోట్లు) కావడం గమనార్హం. ఇది 14 ఏళ్ల గరిష్ఠస్థాయి. 2021 మార్చిలో చమురు దిగుమతి బిల్లు 8.4 బిలియన్ డాలర్లే (సుమారు రూ.63,000 కోట్లు). ఈసారి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు జీవనకాల గరిష్ఠాలకు చేరడమే ఈ పరిస్థితికి కారణం.
- ఈ ఏడాది జనవరి నుంచి పెరుగుతూ వచ్చిన ముడిచమురు ధరలు, ఫిబ్రవరిలో బ్యారెల్ 100 డాలర్లపైకి చేరాయి. మార్చి ఆరంభంలో 140 డాలర్లకు సమీపించాయి కూడా. తదుపరి మళ్లీ కాస్త తగ్గినా, ఇప్పుడు బ్యారెల్ 106 డాలర్ల వద్ద ఉంది.