Indian Mobile Congress 2023 :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీ, ప్రగతి మైదాన్‌లోని భరత్ మండపంలో 7వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ సంస్థలకు 100 5జీ ల్యాబ్స్‌ను ప్రదానం చేశారు.
ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోరమ్ అయిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్.. దిల్లీలో మూడు రోజులపాటు అంటే అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 29 వరకు వరకు కొనసాగనుంది.
ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023ని.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ (DoT), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దేశంలో టెలికమ్యునికేషన్స్ అండ్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
భారత్ సారథ్యంలో.. 6జీ
Modi About 6G Services In India :భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభించిన ఒక్క సంవత్సర కాలంలోనే.. దేశవ్యాప్తంగా 4 లక్షల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటుచేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఒకప్పుడు మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే 118వ స్థానంలో ఉంటే.. నేడు 43వ స్థానానికి చేరుకుందని ఆయన వెల్లడించారు. టెక్నాలజీ భవిష్యత్ భారతదేశంలోనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
త్వరలోనే 6జీ సేవలను అందించడంలోనూ భారత్ ముందుంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ సాంకేతికతను మరింత ముందుకు తీసుకుపోవడానికి కావల్సిన వనరులను, పెట్టుబడులను సమకూర్చడానికే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని మోదీ ఈ సందర్భంగా పేరుకొన్నారు.