గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000కు మించి చేసే మర్చంట్ లావాదేవీలపై సర్ఛార్జ్ చెల్లించాలన్న వార్తలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. యూపీఐ వినియోగదారులు అందరిపై ఈ అదనపు భారం పడుతుందని అందరూ ఆందోళన చెందగా.. అలాంటిదేమీ లేదని భారత జాతీయ చెల్లింపుల సంస్థ- ఎన్పీసీఐ బుధవారం స్పష్టం చేసింది.
అంతకుముందు.. యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ఫేస్-యూపీఐ ద్వారా చేసే మర్చంట్ లావాదేవీలపై ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్- పీపీఐ ఫీజు వసూలు చేయనున్నట్లు ఎన్పీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. యూపీఐ ద్వారా రూ.2000కన్నా ఎక్కువ మొత్తం బదిలీ చేస్తే.. లావాదేవీ విలువలో 1.1శాతం సుంకం విధించనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30 నాటికి ఈ ఛార్జీపై సమీక్షిస్తామని చెప్పింది. ట్రాన్సాక్షన్ ఆమోదించడం, ప్రాసెస్ చేయడం, పూర్తి చేయడానికి సంబంధించిన ఖర్చుల దృష్ట్యా ఈ సర్ఛార్జ్ విధిస్తున్నట్లు జాతీయ చెల్లింపుల సంస్థ- ఎన్పీసీఐ స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1న అమల్లోకి వస్తాయని తెలిపింది.
యూపీఐ లావాదేవీలపై సర్ఛార్జ్.. సాధారణ యూజర్లపై ప్రభావం ఉంటుందా? - పీపీఐ లావాదేవీలపై సర్ఛార్జ్
యూపీఐ ఆధారంగా పని చేసే గూగుల్ పే, పేటీఎం లావాదేవీలపై సర్ఛార్జ్ విషయమై జాతీయ చెల్లింపుల సంస్థ బుధవారం మరింత స్పష్టత ఇచ్చింది. ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చేసే మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం ఉండదని తేల్చిచెప్పింది.
మనపై భారం ఉండదా?
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారన్న వార్తలు గతేడాది ఆగస్టులో జోరుగా వినిపించాయి. ఇదే విషయమై రిజర్వు బ్యాంకు అధ్యయనం చేస్తోందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే.. అలాంటి ఆలోచనేమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ 2022 ఆగస్టులో స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వ్యవహారం చర్చనీయాంశమైంది. అయితే.. ఎన్పీసీఐ చెబుతున్న సర్ఛార్జ్.. సాధారణ కస్టమర్స్ చేసే యూపీఐ లావాదేవీలపై ఉండదు. బ్యాంకు ఖాతాలు, రూపే క్రెడిట్ కార్డ్, యూపీఐ యాప్స్‌లోని ప్రీపెయిడ్ వాలెట్స్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్‌పై ఎలాంటి ఛార్జీ వసూలు చేయబోమని జాతీయ చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. అదనపు ఛార్జీ విధిస్తారన్న ఆందోళనలు లేకుండా యూపీఐ యూజర్లు నగదు బదిలీ సేవలు వాడుకోవచ్చని భరోసా ఇచ్చింది.
మరోవైపు.. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. బ్యాంకు ఖాతా ద్వారా లేదా పేటీఎం వాలెట్ ద్వారా డబ్బు పంపినా.. ఎలాంటి ఛార్జీ ఉండదని తేల్చిచెప్పింది.
గత సంవత్సరమే ఆర్బీఐ ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలో కొన్ని మార్పులు చేయడానికి ప్రజాభిప్రాయాన్ని కోరింది. ఇందులో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీనిలో భాగంగానే కొత్త నిబంధనలు 2023 ఏప్రిల్ 1న అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అయితే భారతదేశంలో ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ చెల్లింపు వ్యవస్థలు ఆర్బీఐ ఆధ్వర్యంలో ఉంటాయి. ఐఎమ్పీఎస్, రూపే, యూపీఐ మొదలైన లావాదేవి వ్యవస్థలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యం నిర్వహిస్తుంది. ఇది బ్యాంకులచే నిర్వహించే లాభాపేక్ష లేని సంస్థ. పీపీఐ, కార్డ్ నెట్‌వర్క్‌లు లావాదేవీలు అనేవి ప్రైవేట్ సంస్థలు లాభాల కోసం నిర్వహిస్తాయి.